కాంగ్రెస్ నుండి టిఆర్ఎస్ లోకి ఫిరాయించి పదవులు,ఆర్థిక ప్రయోజనాలు పొందిన 12 మంది ఎమ్మెల్యేలపై తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఇతర నేతలు మొయినాబాద్ పీఎస్ లో ఫిర్యాదు చేశారు. తమ ఫిర్యాదుపై లోతుగా విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఫిరాయింపులపై సీబీఐ, ఈడీకి సైతం ఫిర్యాదు చేస్తామని అవసరమైతే న్యాయపోరాటానికి సిద్ధమని ప్రకటించారు. ఎమ్మెల్యేలను బెదిరించి, ప్రలోభాలకు గురి చేసి తన పార్టీలోకి చేర్చుకున్నడని విమర్శించారు.

కాంగ్రెస్ ఎమ్మెల్యేల ఫిరాయింపులపై సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా స్పీకర్ పట్టించుకోలేదని, 18 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో 12 మందిని తమవైపు తిప్పుకొని విలీనం చేసుకుంటే తమ అభ్యంతరాలను పట్టించుకోకుండా స్పీకర్ ఓకే చెప్పారని రేవంత్ రెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్ అహంకారానికి తెలంగాణ సమాజం సమాధి కట్టాలని అన్నారు. రాష్ట్రంలో ప్రతిపక్షాలు లేకుండా చేసే కుట్ర జరుగుతోందని మండిపడ్డారు. లా పార్టీ మారిన ఎమ్మెల్యేల్లో సబితకు మంత్రి పదవి, రేగా కాంతారావు, పైలెట్ రోహిత్ రెడ్డికి ఆర్థిక పదవులు కట్టబెట్టారని మండిపడ్డారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలంతా ఆర్థిక, రాజకీయ ప్రయోజనాలు పొందారని రేవంత్ ఆరోపించారు.