మిలిటరీ ఇంజనీర్ సర్వీసెస్ లో మహిళల సంఖ్య పెరగాలి : రాష్ట్రపతి ముర్ము

రక్షణ రంగంలో మహిళా సాధికారత పెరుగుతోందని, ఇదో సానుకూలమైన మార్పు అని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అన్నారు. మిలిటరీ ఇంజనీర్ సర్వీసెస్ (ఎంఈఎస్) లో మహిళల సంఖ్య ఇంకా పెరగాలని ఆకాంక్షించారు. ఇండియన్ డిఫెన్స్‌ సర్వీస్ ఆఫ్​ ఇంజనీర్స్, ఎంఈఎస్ ఆర్కిటెక్ట్, సర్వేయర్ క్యాడర్ కు చెందిన చెందిన ట్రైనీ ఆఫీసర్లు రాష్ట్రపతి భవన్ కు వెళ్లి… రాష్ట్రపతి ముర్ముతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి ముర్ము మాట్లాడుతూ.. యంగ్ ఆఫీసర్లుగా పర్యావరణంపై శ్రద్ధ వహించాలని సూచించారు. మెరుగైన సేవలు అందించేందుకు ఇన్ఫర్మేషన్, కమ్యూనికేషన్ టెక్నాలజీని ఉపయోగించుకోవాలన్నారు.

సుస్థిరమైన అభివృద్ధి కోసం పునరుత్పాదక శక్తిని పెంచే దిశగా మనం ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. దేశం కోసం మన జవాన్లు తమ ప్రాణాలు అర్పించేందుకు ఎప్పుడూ సిద్ధంగా ఉంటారని, అలాంటి సైనికులకు సేవలు అందిస్తున్నందుకు మీరు (ఎంఈఎస్ ట్రైనీ ఆఫీసర్లు) గౌరవంగా భావించాలని అన్నారు. అమృత్ కాల్ లోకి భారత దేశం ప్రవేశించిందని, జీ 20 అధ్యక్ష బాధ్యతలను కూడా స్వీకరించిందని, ఇలాంటి సమయంలో విధుల్లో చేరారని అన్నారు. కొత్త ఆవిష్కరణలు, పరిష్కారాల కోసం ప్రపంచం మొత్తం భారత్ వైపు చూస్తోందని, అందుకే టెక్నాలజీని బాగా వాడుకోవాలని రాష్ట్రపతి ముర్ము సూచించారు.

Related Posts

Latest News Updates