ఈ ఆర్థిక సంవత్సరం మొదటి తొమ్మి ది నెలల్లోనే సింగరేణి టర్నోవర్‌లో భారీ వృద్ధిని సాధించిందని సీఎండీ శ్రీధర్‌ వెల్లడించారు. గడిచిన 9 నెలల్లో రూ. 23,225 కోట్ల టర్నోవర్‌ సాధించినట్టు పేర్కొన్నారు. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో సాధించిన రూ.18,956 కోట్ల టర్నోవర్‌తో పోల్చుకుంటే ఇది 23 శాతం అధికమని తెలిపారు. ఇదే స్థాయిలో ముందుకెళితే.. ఈ ఆర్థిక సంత్సరం చివరి నాటికి టర్నోవర్‌ రూ. 34 వేల కోట్లకు చేరుకోనున్నట్టు అంచనా వేశారు.

సింగరేణిలో కొత్తగా చేపట్టనున్న ప్రాజెక్టులపై సీఎండీ శ్రీధర్‌ బుధవారం డైరెక్టర్లు, అడ్వైజర్లు, ప్రాజెక్ట్‌ ప్లానింగ్‌ అధికారులు, ఏరియా జీఎంలతో సమీక్ష నిర్వహించారు. ఈ కొత్త సంవత్సరం లో కనీసం నాలుగు కొత్త గనుల నుంచి బొగ్గు ఉత్పత్తి చేయాలని సింగరేణి నిర్ణయించుకుంది. ఇం దులో ఒడిశాలోని నైనీతోపాటు మరో మూడు ఉపరితల గనుల (ఓసీ) నుంచి బొగ్గు ఉత్పత్తిని ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలని సీఎండీ ఎన్‌ శ్రీధర్‌ అధికారులను ఆదేశించారు. ఒడిశాలో చేపట్టిన నైనీ బొగ్గు బ్లాక్‌ లో మార్చి నుంచి బొగ్గు ఉత్పత్తి ప్రారంభించాలని సీఎండీ స్పష్టం చేశారు.