కామారెడ్డి పట్టణ నూతన మాస్టర్ ప్లాన్ ను వ్యతిరేకిస్తూ రైతులు పెద్ద ఎత్తున నిరసన, ర్యాలీ కార్యక్రమాలు చేపట్టారు. సొంతగా ట్రాక్టర్లు చేసుకొని, ర్యాలీలతో కామారెడ్డి కలెక్టరేట్ వరకూ పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. కామారెడ్డి మున్సిపాలిటీ మాస్టర్ ప్లాన్ ముసాయిదాను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. తమ పంట భూములు ఇండస్ట్రియల్ జోన్లోకి మార్చడంతో తాము తీవ్రంగా నష్టపోతున్నామని, వెంటనే మాస్టర్ ప్లాన్ ను మార్చేయాలని డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమానికి బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు మద్దతు తెలిపారు.మరోవైపు పోలీసులు కూడా బారికేడ్లు ఏర్పాటు చేశారు. దీంతో బారికేడ్లను తోసుకుని కలెక్టరేట్‌లోకి వెళ్లేందుకు ప్రయత్నించారు.

పోలీసులు అడ్డుకోవడంతో తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది.  తమ పంట భూములను ఇండస్ట్రియల్ కారిడార్ కు బలవంతంగా ఇచ్చేసి… కేసీఆర్ ప్రభుత్వం తమ పొట్ట కొడుతోందని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు మాస్టర్ ప్లాన్ ను వ్యతిరేకిస్తూ అడ్లూర్ ఎల్లారెడ్డికి చెందిన రాములు అనే రైతు ఆత్మహత్య చేసుకోవడంతో రైతులు మరింత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మాస్టర్ ప్లాన్ ను వెనక్కి తీసుకొనేవరకు తమ ఆందోళన నిర్వహిస్తామని రైతులు తేల్చి చెప్పారు. మాస్టర్ ప్లాన్ ను వెనక్కి తీసుకోకపోతే తమ ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.