ప్రజల భాగస్వామ్యం వుంటే.. ఏ మిషన్ అయినా సఫలం అవుతుందని, ఇందుకు స్వచ్ఛ భారత్ తాజా ఉదాహరణ అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. నీటి సంరక్షణ విషయంలో కేవలం ప్రభుత్వాల ప్రయత్నాలు మాత్రమే సరిపోవని, అందుకు ప్రజలు కూడా తమ పూర్తి సహకారాన్ని అందించాలని ప్రధాని నరేంద్ర మోదీ ఆకాంక్షించారు. నీటి సంరక్షణ విషయంలో కేవలం ప్రభుత్వాలు చేసే ప్రయత్నాలు మాత్రమే సఫలం కావని, ఆ సఫలతలో ప్రజల భాగస్వామ్యం కూడా వుండాలన్నారు. ప్రధాని మోదీ వర్చువల్ గా రాష్ట్రాల జలవనరుల శాఖా మంత్రులతో ప్రసంగించారు. నీటి సంరక్షణ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సహకారం, సమన్వయం వుండాలన్నారు. పట్టణీకరణ వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో నీటి సంరక్షణకు ముందే ప్రణాళికలు వేసుకోవాలని సూచించారు.

నీటి పరిరక్షణ విషయంలో ప్రజల్లో మరింత అవగాహన తీసుకురావాలని పిలుపునిచ్చారు. ఇక.. నీరు కలుషితం కాకుండా.. వ్యర్థాల నిర్వహణ, మురునీటి శుద్ధిపై రాష్ట్రాలు బాగా పని చేయాలని, ఇందు కోసం నమామి గంగే అనే ప్రాజెక్టును ఓ నమూనాగా స్వీరించవచ్చని అన్నారు. ప్రతి ఇంటికి నీటిని అందించేందుకు జల్ జీవన్ మిషన్ ఒక ప్రధాన వనరుగా మారిందన్నారు. నీటి సంరక్షణలో భారత్ పురోగతి సాధించిందని, అమృత్ కాల్కు మనం పాటిస్తున్న నీటి సంరక్షణ దార్శనికత పెద్ద సహకారంగా నిలుస్తుందని మోదీ వివరించారు. ప్రతి జిల్లాలో 75 అమృత్ సరోవరాలను నిర్మించడానికి ప్రయత్నాలు ప్రారంభమయ్యాయని, ఇప్పటి వరకూ 25 వేల అమృత్ సరోవర్లను నిర్మించామని మోదీ గుర్తు చేశారు.












