ప్రసార భారతి అభివృద్ధి కోసం 2,500 కోట్లను మంజూరు చేస్తూ కేంద్ర కేబినెట్ నిర్ణయం

గ్రీన్ హైడ్రోజన్ మిషన్ ను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ యేడాదికి 19,744 కోట్లను కేటాయించింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం సాయంత్రం జరిగిన కేంద్ర కేబినెట్ భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నారని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ ప్రకటించారు. నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ ద్వారా 2030 నాటికి 8 లక్షల కోట్ల పెట్టుబడులు, 6 లక్షలకు పైగా ఉద్యోగాలు వస్తాయన్న అంచనాల్లో వున్నామని తెలిపారు. వచ్చే 5 సంవత్సరాల్లో యేడాదికి 50 లక్షల టన్నుల చొప్పున గ్రీన్ హైడ్రోజన్ ను ఉత్పత్తి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నామని మంత్రి ప్రకటించారు. దేశంలో కర్బన ఉద్గారాలను తగ్గించడానికి మోదీ ప్రభుత్వం గ్రీన్ హైడ్రోజన్ మిషన్ ను ప్రోత్సహిస్తోంది. ఈ మిషన్ సాకారమైతే.. భారత్ ఇంధన రంగంలో స్వయం ప్రతిపత్తిని సాధిస్తుంది. కార్బన్ రహిత హైడ్రోజన్ ను ఆటోమొబైల్స్, ఆయిల్ రిఫైనరీలు, స్టీల్ ప్లాంట్లలో ఉపయోగించవచ్చు.

దీనితో పాటు మరో కీలక నిర్ణయం కూడా కేంద్ర కేబినెట్ తీసుకుందని మంత్రి అనురాగ్ ప్రకటించారు. దూరదర్శన్, ఆల్ ఇండియా రేడియోను మరింత బలోపేతం చేయడానికి మోదీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ రెండు సంస్థల అభివృద్ధి కోసం ప్రసార భారతికి రూ.2,500 కోట్లు కేటాయిస్తూ కేంద్ర క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక వ్యవహారాల కమిటీ అంగీకారం కూడా తెలిపింది. ‘బ్రాడ్‌కాస్టింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ నెట్‌వర్క్ డెవలప్‌మెంట్ (బీఐఎన్‌డీ)’ స్కీమ్ కింద 2025-26 లోపు రూ.2,539 కోట్లను ప్రసార భారతికి కేటాయించనున్నట్లు ఆయన తెలిపారు. ప్రసార భారతి సంస్థకు సంబంధించిన నిర్మాణ సామగ్రిని మెరుగుపర్చుకునేందుకు, ఆధునికీకరించేందుకు, ఇతర పనుల కోసం ఈ నిధులను కేటాయిస్తున్నట్లు వివరించారు. ఈ నిధులతో ఓబీ వ్యాన్ల కొనుగోలు, డిజిటల్ అప్‌గ్రేడెషన్, ఎయిర్ స్టూడియోస్, హెచ్‌డీ సర్వీసెస్ వంటి సదుపాయాలు అందుతాయని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ పేర్కొన్నారు.

 

Related Posts

Latest News Updates