జిల్లాలోని శాంతిపురం మండలం గడ్డూరులో ఉద్రిక్తత చోటు చేసుకుంది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకి స్వాగతం పలికేందుకు వెళ్తున్న టీడీపీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. చంద్రబాబు రోడ్‌షో, సభకు అనుమతిలేదని పోలీసులు చెబుతున్నారు. ఈ క్రమంలో పోలీసులు, టీడీపీ శ్రేణుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. పోలీసుల తీరుపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు. సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. పోలీసుల బారికేడ్లను టీడీపీ కార్యకర్తలు ఎత్తిపడేసి ఆందోళనకు దిగారు. కార్యకర్తలపై పోలీసుల లాఠీఛార్జి చేయడంతో 10 మంది టీడీపీ కార్యకర్తలకు గాయాలైనట్లు తెలుస్తోంది.

ఇదేం ఖర్మ రాష్ట్రానికి అన్న కార్యక్రమంలో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కుప్పంలో మూడు రోజుల పర్యటించనున్నారు. అయితే.. పోలీసులు మాత్రం అడుగడుగునా ఆంక్షలు విధిస్తున్నారు. టీడీపీ ప్రచార వాహనాల డ్రైవర్లపై పోలీసులు చేయి చేసుకోవంతో టెన్షన్ వాతావరణం నెలకొంది. టీడీపీ ప్రచార రథాలు, సౌండ్ సిస్టమ్ వాహనాలను పోలీసులు పీఎస్ కి తరలించారు. మరోవైపు బెంగళూరు నుంచి చంద్రబాబు పెద్దూరు గ్రామం చేరుకోనున్నారు. అయితే… రోడ్లపై సభలు, ర్యాలీలను నిషేధిస్తూ.. జగన్ ప్రభుత్వం తాజాగా జీవో జారీ చేసింది. దీంతో చంద్రబాబు సభకు అనుమతి లేదని పోలీసులు చెబుతున్నారు. దీంతో శాంతిపురంలో టెన్షన్ వాతావరణం నెలకొంది.












