తెలంగాణలో భారీగా ఐపీఎస్ బదిలీలు జరిగాయి. ఒకే సారి 29 మంది సీనియర్ అధికారులను వివిధ పోస్టుల్లోకి బదిలీలు చేశారు. కీలక ఆఫీసర్లకు అదనపు బాధ్యతలను కూడా కట్టబెట్టారు. హైదరాబాద్ సీపీగా వున్న సీవీ ఆనంద్ ను తెలంగాణ స్టేట్ యాంటీ నార్కోటిక్స్ బ్యూరోకి పూర్తి స్థాయి డీజీగా అదనపు బాధ్యతలు కట్టబెట్టారు. ఇక… సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఐజీగా సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్రకు పూర్తి స్థాయి అదనపు బాధ్యతలు కట్టబెట్టింది. డీజీ ఆర్గనైజేషన్స్ గా వున్న అదనపు డీజీ రాజీవ్ రతన్ ను తెలంగాణ పోలీసింగ్ హౌజింగ్ కార్పొరేషన్ ఎండీగా బదిలీ చేశారు. అడిషనల్ డీజీ రైల్వేస్ రోడ్ సెఫ్టీగా వున్న సందీప్ శాండిల్యను తెలంగాణ రాష్ట్ర పోలీస్ అకాడమీ డైరెక్టర్ గా నియమించారు.

ఇక.. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన షీటీమ్స్ అదనపు డీజీగా ఏసీబీ డైరెక్టర్ గా వున్న షికా గోయల్ ను నియమించారు. ఉమెన్‌ సేఫ్టీ, షీ టీమ్స్‌, భరోసా అడిషనల్‌ డైరెక్టర్‌ జనరల్‌గా పనిచేసిన స్వాతి లక్రాను టీఎస్‌ఎస్‌పీ బెటాలియన్స్‌ అడిషనల్‌ డైరెక్టర్‌ జనరల్‌గా బదిలీ చేసింది. విజయ్‌కుమార్‌ను గ్రేహౌండ్స్‌, అక్టోపస్‌ అడిషనల్‌ డైరెక్టర్‌ జనరల్‌గా నియమించింది. బీ శివధర్‌రెడ్డిని రైల్వే, రోడ్డు సేఫ్టీ అడిషనల్‌ డైరెక్టర్‌గా, కొత్తకోట శ్రీనివాసరెడ్డిని ఆర్గనైజేషన్‌ అండ్‌ లీగల్‌ అడిషనల్‌ డైరెక్టర్‌ జనరల్‌గా నియమించింది.