కేసీఆర్ ప్రకటించిన బీఆర్ఎస్ పై బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ సెటైర్ వేశారు. బీఆర్ఎస్కు జాతీయాధ్యక్షుడే లేడని.. అటువంటిది ఏపీ రాష్ట్ర అధ్యక్షుడిని ఎలా ప్రకటిస్తారని ప్రశ్నించారు. తంలో ఏపీ ప్రజలను అవమానించిన కేసీఆర్ ఇప్పుడు ఏపీ అభివృద్ధికి గురించి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఏపీ వ్యాపారులు ఇక్కడ ప్రశాంతంగా వ్యాపారం చేసుకునే పరిస్థితి లేదన్నారు. కేసీఆర్ మళ్లీ సెంటిమెంట్ రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ఏపీ ప్రజలను మచ్చిక చేసుకునే ప్రయత్నం చేసిండన్నారు. నాంపల్లిలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో బీజేపీ అధ్యక్షుడు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… నిరుద్యోగుల నోరు మూయించేందుకు కేసీఆర్ ప్లాన్‌ చేస్తున్నారని అన్నారు. తెలంగాణను అన్ని రంగాల్లో నాశనం చేసిన కేసీఆర్ దేశాన్ని ఏ విధంగా ఉద్దరిస్తారు? అని ఆయన ప్రశ్నించారు.

 

నిరుద్యోగంలో దేశంలోనే తెలంగాణ 5వ స్థానం, దక్షిణాదిలో మొదటి స్థానంలో ఉందన్నారు. రైతుల ఆత్మహత్యల్లో రాష్ట్రం 4వ స్థానంలో ఉందని పేర్కొన్నారు. మద్యం ద్వారా 44 వేల కోట్ల ఆదాయం వస్తుందన్నారు. పథకాలు పోనూ 17 వేల కోట్లు మిగులుతున్నాయని ఆరోపించారు. ఆ డబ్బంతా ఎక్కడికి పోతుందో అర్థంకావడం లేదన్నారు.హైదరాబాద్ లో వున్న ఆంధ్రా ఓటర్లను నమ్మించి, ఓట్లు వేయించుకోవడం కేసీఆర్ కి తెలిసిన విద్య అని బండి సంజయ్ ఎద్దేవా చేశారు. ఓట్లు అయిపోయాక నీళ్ల వాటా పేరుతో ఏపీ, తెలంగాణ అని మళ్లీ రెచ్చగొడతారని మండిపడ్డారు. గతంలో ఏపీ వారిని కేసీఆర్ అవమానించలేదా? అని ప్రశ్నించారు. సొంత రాష్ట్రంలోనే పార్టీ అధ్యక్షుడిని ప్రకటించలేదు కానీ.. పక్క రాష్ట్రానికి అధ్యక్షుడిని ప్రకటించారని చురకలంటించారు. బీఆర్ఎస్ పరిస్థితి ఏమిటో ప్రజలకు అర్థమవుతోందని బండి సంజయ్ విమర్శించారు.