అరుణాచల్ ప్రదేశ్‌లో బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (BRO) నిర్మించిన 27 ఇతర మౌలిక సదుపాయాల ప్రాజెక్టులతో పాటు సియోమ్ వంతెనను రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా రాజ్ నాథ్ సింగ్ మాట్లాడుతూ.. సున్నిత సరిహద్దు ప్రాంతాలలో భారత సాయుధ దళాల కదలికలు సులభతరం చేయడానికి 724 కోట్ల వ్యయంతో 28 ప్రాజెక్టులు నిర్మించినట్లు స్పష్టం చేశారు. దేశాల ప్రాధాన్యతలు, ఆసక్తులు ఎప్పటికప్పుడు మారుతాయని రాజ్ నాథ్ సింగ్ అన్నారు. ఏ దేశమైనా తనను తాను శక్తి వంతంగా ఉంచుకోవడం అవసరమని చెప్పారు.

భారత్ ఎప్పుడూ యుద్ధాన్ని ప్రోత్సహించదని, పొరుగు దేశాలతో ఎల్లప్పుడూ సత్సంబంధాలను కొనసాగించాలని కోరుకుంటుందని చెప్పారు. యుద్ధం మీద తమకు నమ్మకం లేదని, ఒకవేళ అలాంటి ప్రయోగం ఎవరైనా చేస్తే ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని తేల్చి చెప్పారు. మౌలిక సదుపాయాల అభివృద్ధికి B.R.O విశేష కృషి చేస్తోందని, ఇది కేవలం సరిహద్దులలో సైన్యం వరకే పరిమితం కాదని, దేశంలో అనేక ప్రాంతాల ప్రజలను అనుసంధానిస్తోందని స్పష్టం చేశారు.












