బ్రిటన్ పరిస్థితులపై ఆ దేశ ప్రధాని రిషి సునాక్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కొత్త సంవత్సరంలో స్థానిక ఆర్థిక పరిస్థితులు దిగ జారడంతోపాటు రాజకీయ సంక్షోభాలు, ఉక్రెయిన్-రష్యా యుద్ధం వల్ల 2022లో బ్రిటన్ పలు ఇబ్బందులను ఎదుర్కొన్నది. 2023లోనూ తమ కష్టాలు తీరబోవని ప్రధాని రిషి సునాక్ అన్నారు. దేశ ప్రధానిగా తొలిసారి పౌరులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా బ్రిటన్ను సమస్యల నుంచి గట్టెక్కించడానికి తీవ్రంగా కృషి చేస్తామని పునరుద్ఘాటించారు. ప్రపంచ దేశాల ముందు, వేదికలపై అత్యుత్తమ బ్రిటన్ను ప్రదర్శించడానికి 2023 అవకాశం కల్పిస్తుందన్నారు.
ఉక్రెయిన్-రష్యా యుద్ధం బ్రిటన్ ముందు ఉన్న అతిపెద్ద సవాళ్లలో ఒకటి. కొవిడ్ మహమ్మారి నుంచి దేశం కోలుకోగానే ఉక్రెయిన్పై రష్యా అక్రమ దండయాత్ర చేపట్టింది. ఇది అంతర్జాతీయంగా ఆర్థికంగా తీవ్ర ప్రభావం చూపింది. దీనికి బ్రిటన్ మినహాయింపు కాదు. అందువల్లే రుణాలు, అప్పుల నియంత్రణ విషయమై కష్టమైనా న్యాయమైన నిర్ణయాలు తీసుకున్నాం అని రిషి సునాక్ పేర్కొన్నారు. ప్రభుత్వం పేదలకు అండగా నిలుస్తున్నది. జాతీయ ఆరోగ్య సేవలను బలోపేతం చేయడానికి చర్యలు తీసుకున్నాం. అక్రమ వలసల సమస్య పరిష్కరిస్తున్నాం. నేరస్తులను కట్టడి చేస్తున్నాం అని తెలిపారు












