రాష్ట్ర వ్యాప్తంగా నూత‌నంగా నియామ‌క‌మైన డాక్ట‌ర్ల‌కు నియామ‌క ప‌త్రాల‌ను మంత్రి హ‌రీశ్‌రావు అంద‌జేశారు. హైటెక్ సిటీ శిల్పాక‌ళా వేదిక‌లో జ‌రిగిన ఈ కార్య‌క్ర‌మంలో మంత్రి హ‌రీశ్‌రావు ప్ర‌సంగించారు. కొత్త సంవ‌త్స‌రంలో కొత్త ఉద్యోగం, కొత్త జీవితం ప్రారంభించ‌బోతున్న వైద్యులకు హృద‌య‌పూర్వ‌క శుభాకాంక్ష‌లు తెలిపారు. వైద్యులంద‌రికీ నూత‌న సంవ‌త్స‌ర శుభాకాంక్ష‌లు తెలుపుతూ… రాష్ట్ర వైద్యారోగ్య శాఖ చ‌రిత్ర‌లో ఇన్ని ఉద్యోగాలు, పార‌ద‌ర్శ‌కంగా చేప‌ట్ట‌డం ఇదే ప్ర‌థ‌మం అని అనుకుంటున్నానని అన్నారు. క‌రోనా స‌మ‌యంలో క‌ష్ట‌ప‌డ్డ డాక్ట‌ర్ల‌కు రెగ్యుల‌ర్ రిక్రూట్‌మెంట్‌లో 20 మార్కుల‌ను వెయిటేజీ కింద ఇచ్చామని తెలిపారు. దీంతో చాలా మందికి అవ‌కాశాలు వ‌చ్చాయని వివరించారు. 20 నుంచి 40 శాతం పీజీ సీట్ల‌లో కూడా రిజ‌ర్వేష‌న్ క‌ల్పించాం అని తెలిపారు. ఆదివారం నుంచి కొత్త ఉద్యోగాల్లో చేరితే బాగుంటుందని సూచించారు. గ్రామాల ప్ర‌జ‌లు కూడా సంతోష‌ప‌డుతారన్నారు.

ప్ర‌జ‌ల‌కు అందుబాటులో ఉండి, పేద‌ల‌కు సేవ చేయాలని మంత్రి వైద్యులకు పిలుపునిచ్చారు. తమ తమ పీహెచ్‌సీ ప‌రిధిలో ఉత్త‌మ‌మైన సేవ‌లు అందించాలని ఆకాంక్షించారు. చేతులెత్తి దండం పెడుతున్నా.. ట్రాన్స్‌ఫ‌ర్ల‌కు ఎవ‌రూ త‌న వ‌ద్ద‌కు రావొద్దు. క‌నీసం 2-3 ఏండ్లు ఇచ్చిన పోస్టింగ్‌లో ప‌ని చేయాల‌న్నారు. బాగా ప‌ని చేస్తే ట్రాన్స్‌ఫ‌ర్ల‌కు సంబంధించిన‌ కౌన్సెలింగ్‌లో వెయిటేజీ క‌ల్పిస్తామ‌ని మంత్రి హ‌రీశ్‌రావు సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో ప‌ని చేయాల‌ని, పేద‌ల‌కు మెరుగైన వైద్యం అందించాల‌ని కోరుకున్నారు. త‌ల్లిదండ్రులు, గురువుల‌కు కృత‌జ్ఞ‌త‌లు తెలుపుతున్నానని,పేద‌ల‌కు సేవ చేసి గొప్ప డాక్ట‌ర్లుగా పేరు పొందాల‌ని మంత్రి హరీశ్ ఆకాంక్షించారు.