తెలంగాణ డీజీపీగా మహేందర్ రెడ్డి పదవీ విరమణ చేశారు. డీజీపీ మహేందర్‌ రెడ్డి పదవీకాలం నేటితో ముగియనుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లోని తెలంగాణ పోలీస్‌ అకాడమీలో పదవీ విరమణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పోలీసు ఉన్నతాధికారులు, నూతన డీజీపీ అంజనీ కుమార్, తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మహేందర్ రెడ్డికి ఘనంగా వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా మహేందర్‌ రెడ్డి మాట్లాడుతూ.. పోలీసు అధికారులు తనపై చూపిన ఆదరణకు ధన్యవాదాలు తెలిపారు. గత 36 ఏండ్లుగా పోలీస్‌ శాఖలో పనిచేయడం సంతోషంగా ఉందన్నారు. తదుపరి డీజీపీగా బాధ్యతలు చేపట్టనున్న అంజనీ కుమార్‌కు అభినందనలు తెలిపారు. ఆయన నేతృత్వంలో పోలీస్‌ వ్యవస్థ మరింత ముందుకెళ్తుందని ఆకాంక్షించారు. పోలీసు వ్యవస్థను ప్రజలకు సౌకర్యంగా ఉండేలా చేశామని డీజీపీ మహేందర్‌ రెడ్డి అన్నారు.

ప్రతి పోలీస్‌స్టేషన్‌ అవసరాల కోసం ప్రత్యేక నిధులు కేటాయించామని చెప్పారు. ప్రజలకు నాణ్యమైన పోలీస్‌ సేవలు అందేలా ఎన్నో చర్యలు చేపట్టామని తెలిపారు. నూతన రాష్ట్రంలో 8 సంవత్సరాల పాటు పోలీస్ విభాగంలో కీలక పదవులు నిర్వహించడానికి అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు ప్రకటించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారంతోనే పోలీస్ శాఖలో సంస్కరణలు తెచ్చామని, ఫ్రెండ్లీ పోలీసింగ్ సాధ్యమైందన్నారు. పోలీస్ శాఖలో పనిచేస్తున్న వారి జీత భత్యాలు, సంక్షేమాన్ని రాష్ట్ర ప్రభుత్వం పెంచిందని వెల్లడించారు. ట్రాఫిక్‌ పోలీసులకు 30 శాతం అలవెన్సులు, హోమ్‌గార్డులకు రూ.20 వేల జీతాన్ని ఇస్తున్నామన్నారు. అర్బన్‌ ఏరియాలను కవర్‌ చేస్తూ ప్రభుత్వం 7 కమిషనరేట్లను ఏర్పాటు చేశామని తెలిపారు. ఇప్పటివరకు 27 వేల మంది పోలీసులను రిక్రూట్‌ చేశామన్నారు. మరో 17 వేల పోస్టులు భర్తీ చేయబోతున్నామని చెప్పారు. అద్భుత పనితీరు కనబరిచిన పోలీసులందరికి శుభాకాంక్షలు తెలిపారు.