ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా), ప్రపంచ సాహిత్య వేదిక, తానా చైతన్య స్రవంతి, తారా అకాడమీ ఆధ్వర్యంలో జనవరి 1 న రవీంద్ర భారతిలో బహుజన కళా మహోత్సవం జరగనుంది. ఈ విషయాన్ని తానా ప్రపంచ సాహిత్య వేదిక అధ్యక్షుడు డా. ప్రసాద్ తోటకూర వెల్లడించారు. ఆదివారం ఉదయం 9 నుంచి రాత్రి 9 గంటల వరకూ ఈ కార్యక్రమం వుంటుందని తెలిపారు. ఇందులో తెలుగు రాష్ట్రాల నుంచి సుమారు 300 మంది కళాకారులు పాల్గొంటారని, వారి వారి కళా రూపాలను ప్రదర్శిస్తారని పేర్కొన్నారు. . ‘‘తానా’’ తొలిసారిగా సామాజిక దృక్ఫథంతో అన్నివర్గాల కళాకారులను ప్రోత్సహించాలనే ఉద్దేశ్యంతో ఈ వైవిధ్యభరితమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు వారు తెలిపారు.


ఇందులో భాగంగా తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్‌ ఛైర్మన్‌, ప్రముఖ బీసీ వర్గాల ప్రతినిధి డాక్టర్‌ వకుళాభరణం కృష్ణమోహన్‌రావుకు ‘‘బహుజన బంధు’’ పురస్కారం అందజేస్తున్నట్లు తెలిపారు. ఆయన నేటి ఉభయ తెలుగు రాష్ట్రాలలో గడిచిన మూడు దశాబ్దాలుగా విశేషంగా బీసీ వర్గాల హక్కులు, ప్రయోజనాల సాధనకు నిరంతరం కృషిచేస్తూనే ఉన్నారన్నారు. అన్ని కోణాలలో పరిశీలించిన దరిమిలా ‘‘పురస్కారం జ్యూరి కమిటి’’ ఈ అవార్డును డాక్టర్‌ వకుళాభరణంకు ఇవ్వాలని సూచించినట్లు వారు పేర్కొన్నారు. బహుజన కళా మహోత్సవాలు జరిగే ఆదివారం రోజంతా అన్ని కళారూపాల ప్రదర్శనలు ఉంటాయన్నారు. అలాగే బహుజన వర్గాల నుండి వివిధ రంగాలలో ‘‘పద్మశ్రీ’’ పురస్కారాలు అందుకున్న ప్రముఖులు కిన్నెరమెట్ల మొగిలయ్య, చింతకింది మల్లేశం, ఆచార్య కొలకనూరి ఇనాక్‌, ఎడ్ల గోపాలరావు, డాక్టర్‌ కూటికుప్పల సూర్యారావు, డాక్టర్‌ సాయిబాబా గౌడ్‌, దళవాయి చలపతిరావులకు జ్ఞాపికలను అందజేసి ఘనంగా సత్కరించనున్నట్లు తెలిపారు.