ప్రధాని నరేంద్ర మోదీ తల్లి హీరాబెన్ అంత్యక్రియలు ముగిశాయి. తల్లి హీరాబెన్ పాడెను మోదీ మోశారు. తల్లి మరణ వార్త తెలియగానే ఢిల్లీ నుంచి ప్రధాని మోదీ అహ్మదాబాద్ కి చేరుకున్నారు. తల్లి పార్థివదేహం వద్దే కూర్చొని, తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. అంతిమయాత్ర వాహనంలోనే వున్నారు. మోదీ తన సోదరులతో కలిసి తల్లి అంతిమ సంస్కారాలను నిర్వహించారు. హీరాబెన్ మరణ వార్త తెలుసుకొని, పలువురు రాజకీయ ప్రముఖులు నివాళులు అర్పించారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని కోరారు.

ప్రధాని నరేంద్ర మోదీకి మాతృవియోగం కలిగింది. మోదీ తల్లి హీరాబెన్ (100) కన్నుమూశారు. అనారోగ్య కారణాల రీత్యా తల్లి హీరాబెన్ అహ్మదాబాద్ లోని యుఎన్ మెహతా ఆసుపత్రిలో చేరారు. ఆమె ఆరోగ్యం నిలకడగానే వుందంటూ గురువారం సాయంత్రం వైద్యులు హెల్త్ బులిటిన్ కూడా విడుదల చేశారు. రెండు రోజుల క్రిందటే… ఆస్పత్రికి వచ్చి, తల్లిని చూసి మాట్లాడి వెళ్లారు. మరో రెండు రోజుల్లో ఇంటికి చేరుకుంటారని అందరూ భావించారు. అంతలోనే హఠాత్తుగా ఆమె మరణించారన్న వార్త మోదీని తీవ్ర విషాదంలో నింపేసింది.












