మంచు తుపాన్ అమెరికాను కుదిపేస్తోంది. ఎడతెరపి లేకుండా కురుస్తున్న మంచుతో అమెరికా, కెనాడాల్లోని పలు ప్రాంతాలు పూర్తిగా స్తంభించిపోయాయి. మంచు తుపాను బారినపడి అమెరికాలో ఇప్పటి వరకూ 68 మంది చనిపోయారు. ఇందులో ఒక్క బఫెలో నగరంలోనే 34 మంది ప్రాణాలు కోల్పోయారు. మ్రుతుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలున్నాయని అధికారులు పేర్కొంటున్నారు. కొన్ని ప్రాంతాల్లో జన జీవనం పూర్తిగా స్తంభించిపోయింది. మంచుతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు కూడా రావడం లేదు. ఇక.. మంచు తుపాన్ తో పలు విమానాలు రద్దయ్యాయి. హైవేలను కూడా అధికారులు మూసేశారు.
స్థానికుల కార్లు పార్కింగ్ వున్న చోటే కొన్ని అడుగుల లోతుల్లో కూరుకుపోయాయి. మూడు రోజులుగా కార్లు మంచులోనే వుండిపోయాయి. న్యూయార్క్ రాష్ట్రంలో కార్లలో చిక్కుకున్న వారిని బయటకు తీసేందుకు కొన్ని వందల నేషనల్ గార్డ్ ట్రూప్స్ ను తరలించారు. వారికి పోలీసులు కూడా సాయంగా వెళ్లారు. పరిస్థితి ఇంకా ప్రమాదకరంగా ఉందని న్యూయార్క్ గవర్నర్ క్యాతీ హోకల్ వెల్లడించారు. పౌరులు ఇండ్లలోనే ఉండాలని ఆమె కోరారు. ఎరీ కౌంటీలో వాహనాల డ్రైవింగ్ పై నిషేధం ఉందన్న విషయం గుర్తుంచుకోవాలన్నారు.