నిర్మాతలు తొమ్మిది రోజులుగా నిరాహారదీక్షలు చేస్తున్నా పట్టించుకోకపోవడం దారుణం: నట్టి కుమార్

రెండేళ్ల కాలపరిమితి పూర్తయి, మూడవ ఏడాది గడుస్తున్నప్పటికీ తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి (ప్రొడ్యూసర్స్ కౌన్సిల్) ఎన్నికలు జరపకపోవడం అప్రజాస్వామికమని సీనియర్ నిర్మాత నట్టి కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ అంశంపై హైదరాబాద్ లోని ఫిలిం ఛాంబర్ ఎదుట నిర్మాత జె.వి. మోహన్ గౌడ్ ఆధ్వర్యంలో జరుగుతున్న రిలే నిరాహార దీక్షలు తొమ్మిదవ రోజుకు చేరుకున్న నేపథ్యంలో నట్టి కుమార్ స్పందిస్తూ…రిలే నిరాహార దీక్షలు చేస్తున్న నిర్మాతలందరికీ తన మద్దతు ప్రకటిస్తున్నట్లు స్పష్టం చేశారు. ప్రస్తుతం నిర్మాతల మండలి అధ్యక్ష,కార్యదర్శులుగా కొనసాగుతున్న సి.కల్యాణ్, టి.ప్రసన్నకుమార్, మోహన్ వడ్లపట్ల గడువు ఎప్పుడో పూర్తయినా, వారు ఆ పదవులనే పట్టుకుని ఊరేగడం ఎంతవరకు కరెక్ట్ అని ఆయన ప్రశ్నించారు. లేక 99 ఏళ్ల వరకు ఎలాంటి ఎలక్షన్స్ జరపకుండా తామే ఆ పదవులలో కొనసాగాలని వారు కోరుకుంటున్నట్లుగా కనిపిస్తోంది. అలాంటి కోరిక ఉన్నప్పుడు, జనరల్ బాడీ మీటింగ్ పెట్టి, అందులో తామే శాశ్వతంగా పదవులలో ఉండేటట్లు ఏకగ్రీవ తీర్మానం చేయించుకోవాలని ఆయన వ్యంగ్యంగా అన్నారు.

 

గత తొమ్మిది రోజులుగా నిర్మాతలు ఎలక్షన్స్ డిమాండ్ పై దీక్షలు చేస్తుంటే, కౌన్సిల్ నాయకులంతా నిమ్మకు నీరెత్తినట్లు ఎంతమాత్రం పట్టించుకోకపోవడం దారుణమని ఆయన పేర్కొన్నారు. ఈ విషయంలో ఛాంబర్ కూడా జోక్యం చేసుకోకపోవడం అన్యాయమని ఆయన అన్నారు. ఇప్పటికైనా ఎలక్షన్స్ జరిపేందుకు నోటిఫికేషన్ ఇచ్చేలా హామీ ఇస్తూ, వారిచేత నిమ్మ రసం తాగించేలా చర్యలు చేపట్టాలని ఆయన కోరారు. ఈ విషయంలో రెండు రాష్ట్రాల సినిమాటోగ్రఫీ శాఖల మంత్రులు, ఎఫ్.డి.సి. చైర్మన్లు జోక్యం చేసుకుని సమస్య పరిష్కారానికి కృషి చేయాలని ఆయన విన్నవించారు. ఇదిలావుండగా, వి.ఎఫ్.ఎక్స్ చార్జీలను తగ్గించేలా చేస్తానంటూ ఛాంబర్ ప్రెసిడెంట్ పదవిలోకి వచ్చే ముందు వాగ్దానం చేసిన బసిరెడ్డి ఆ మాటే మరిచిపోయారని, పై పెచ్చు చార్జీలు మరింత పెరిగి, భారంగా పరిణమించాయని ఆయన వెల్లడించారు. ఇక దిల్ రాజు, దామోదర ప్రసాద్ లు నెలరోజులు సినిమాలు షూటింగులు బంద్ చేయించి, ఏమి సాధించారో స్పష్టం చేయాలని నట్టి కుమార్ డిమాండ్ చేశారు.

Related Posts

Latest News Updates