గాలి జనార్దన్ రెడ్డి బీజేపీతో తనకున్న సుదీర్ఘ అనుబంధాన్ని తెంచేసుకున్నారు. ఓ కొత్త పార్టీ స్థాపించారు. కల్యాణ రాజ్య ప్రగతి పక్ష పేరుతో కొత్త పార్టీని ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. నూతన పార్టీ ద్వారా కన్నడ రాజకీయాల్లో సెకండ్ ఇన్సింగ్స్ మొదలు పెట్టనున్నట్లు గాలిజనార్థన్ రెడ్డి పేర్కొన్నారు. అయితే.. పార్టీని వీడొద్దని బీజేపీ నేతలు చాలా రోజులు బుజ్జగించినా… గాలి వినలేదు. తాను సొంత కుంపటి పెట్టుకుంటానని తేల్చి చెప్పారు.
బీజేపీతో తన బంధం ముగిసిందని గాలి జనార్థన్ రెడ్డి స్పష్టం చేశారు. కర్నాటక అభివృద్ధే తన లక్ష్యంగా పార్టీని స్థాపిస్తున్నట్లు గాలిజనార్థన్ రెడ్డి తెలిపారు. ఎన్ని అడ్డంకులు వచ్చినా ముందుకు సాగుతానని చెప్పారు. రాష్ట్రంలోని ప్రతి పల్లెకు చేరుకునేలా పార్టీని నిర్మిస్తామన్నారు. కల్యాణ రాజ్యప్రగతి పక్ష పార్టీ కర్ణాటక ప్రజల హృదయాలను గెలుచుకుంటుందన్న విశ్వాసం ఉందన్నారు. వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ ఏయే నియోజకవర్గాల్లో పోటీచేస్తుందో త్వరలో వివరాలను వెల్లడిస్తామన్నారు.