సిక్కింలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన 16 మంది జవాన్లకు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నివాళులర్పించారు. ఈ ఘటనలో చనిపోయిన జవాన్లలో నలుగురు యూపీకి చెందినవారున్నారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం తరుపున ఒక్కో కుటుంబానికి రూ. 50 లక్షల ఆర్థిక సాయం అందజేస్తామని సీఎం యోగి ప్రకటించారు. అంతేకాకుండా కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారు. వారి జిల్లాల్లోని రోడ్లకు వారి పేర్లు పెడతామని ప్రకటించారు. ఈ మేరకు సీఎంవో నుండి ఉత్తర్వులు వెలువడ్డాయి. యోగి చేస్తున్న ఈ పనిపై అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. సిక్కింలోని జెమాలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆర్మీకి చెందిన ముగ్గురు జూనియర్ కమీషన్డ్ ఆఫీసర్లు (జేసీఓలు) సహా 16 మంది ఆర్మీ సిబ్బంది మరణించారు. జెమా ప్రాంతంలోని మూలమలుపు వద్ద కాలువలోకి అర్మీ వాహనం పడిపోయింది.