నిర్ణీత షెడ్యూల్ కంటే ముందే ఉభయ సభలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 29 వరకూ సమావేశాలు కొనసాగాల్సి వుంది. బీఏసీ సమావేశంలో పార్లమెంట్ శీతాకాల సమావేశాలను డిసెంబర్ 23 న వాయిదా వేయాలని ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ సమావేశాల్లో 97 శాతం ఉత్పాదక రేటు నమోదైందని స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు. మొత్తం 62గంటల 42 నిమిషాల పాటు పనిచేసినట్టు వివరించారు. ఇక.. రాజ్య సభ చైర్మన్ కూడా నివేదిక ఇచ్చారు.
64 గంటల 50 నిమిషాలు సమావేశమైన సభ 9 బిల్లులను ఆమోదించిందని ప్రకటించారు. 82 ప్రశ్నలకు మంత్రులు సమాధానం ఇచ్చారని, మొత్తం సభా కార్యక్రమాల సమయాన్ని అనుకున్న దానికంటే ఎక్కువగా 102 శాతాన్ని పరిపూర్ణంగా సభ్యులు వినియోగించుకున్నట్టు రాజ్య సభ చైర్మన్ వెల్లడించారు.
అయితే, డిసెంబర్ 9న అరుణాచల్‌ప్రదేశ్‌లోని తవాంగ్ సెక్టార్ వాస్తవాధీన రేఖ వెంబడి భారత్-చైనా సైనికుల మధ్య ఘర్షణ చెలరేగడంతో.. అదే అంశంపై పార్లమెంట్ ఉభయసభలు దద్ధరిల్లాయి. ఘటనపై ప్రభుత్వం ఉభయసభల్లో ప్రకటనలు చేసి చేతులు దులుపుకోగా.. ప్రతిపక్షాలు మాత్రం సమగ్ర చర్చ జరగాలని పట్టుబట్టాయి. ప్రభుత్వం చర్చకు అంగీకరించకపోవడంతో నిత్యం రభస కొనసాగింది. చివరికి ఉభయసభలు నిరవధికంగా వాయిదాపడ్డాయి.












