హైదరాబాద్ లోని ఎన్టీఆర్ స్టేడియంలో 35 వ జాతీయ పుస్తక ప్రదర్శన ప్రారంభమైంది. ఈ పుస్తక ప్రదర్శనను మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… సమాజ మార్పునకు పుస్తకం ముఖ్యపాత్ర పోషిస్తుందని చెప్పారు. శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం ఎంత పెరిగినా పుస్తక పఠనంతో వచ్చిన జ్ఞానం శాశ్వతమని పేర్కొన్నారు. సెల్‌ఫోన్‌ ద్వారా మంచి కంటే చెడు ఎకువగా ప్రచారం జరుగుతున్నదని, ఈ పరిస్థితిని అధిగమించాలంటే పుస్తక పఠనమే ఏకైక మార్గమని చెప్పారు. తెలంగాణ సాయుధ పోరాటం నుంచి నక్సల్బరీ, తెలంగాణ రాష్ట్ర సాధన పోరాటం వరకు పుస్తకాలే ఉద్యమాలను నడిపించాయని గుర్తు చేశారు.

జీవితాలను తీర్చిదిద్దుకోవాలంటే పుస్తక పఠనం భాగం కావాలని సభకు వచ్చిన విద్యార్థులకు సూచించారు. సమాజ మార్పు కోసం పత్రికల సంపాదకులు నిరంతరం తమ కలం ద్వారా కృషి చేస్తున్నారని చెప్పారు. విద్యాశాఖ అధికారులు, పాఠశాలలు, కళాశాలల విద్యార్థులను పుస్తక వేడుకలకు తీసుకురావాలని సూచించారు. అవసరమనుకుంటే పుస్తక ప్రదర్శనను పొడిగించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు.

తొలి రోజు పుస్తక ప్రదర్శన సందర్భంగా కల్చరల్ కార్యక్రమాలు నిర్వహించారు. విద్యార్థులతో పాటు పుస్తక ప్రియులు కూడా భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఈ పుస్తక ప్రదర్శనలో 300 స్టాళ్లను ఏర్పాటు చేశారు. బాల సాహిత్యం, విప్లవ సాహిత్యం, ఆధ్యాత్మికత, వ్యక్తిత్వ వికాసం, ప్రముఖుల జీవిత చరిత్రలతో పాటు అన్ని రకాల పుస్తకాలు అందుబాటులో వున్నాయి. మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 8:30 గంటల వరకూ వుంటుంది. శని, ఆదివారాలు, సెలవు దినాల్లో మధ్యాహ్నం 1 గంట నుంచి రాత్రి 9 గంటల వరకు వుంటుందని నిర్వాహకులు ప్రకటించారు.