మాజీ సీఎం, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఖమ్మం సభ తెలంగాణ రాజకీయాల్లో విమర్శలకు వేదికైంది. బీఆర్ఎస్ నేతలు, మంత్రులు తీవ్రంగా చంద్రబాబుపై విమర్శలు చేస్తున్నారు. ఏపీలో చెల్లని రూపాయి… తెలంగాణలో చెల్లుతుందా? అంటూ మంత్రి హరీశ్ రావు తీవ్రంగా విమర్శలు చేశారు. తెలంగాణ భవన్ లో మంత్రులు శ్రీనివాస్ గౌడ్, కొప్పుల ఈశ్వర్, అజయ్ తదితరులతో మీడియా సమావేశం నిర్వహించారు. ఏపీ ప్రజలే చంద్రబాబు పాలన బాగాలేదని చిత్తుచిత్తుగా ఓడించి వెళ్లగొడితే.. ఇక్కడికి వచ్చి ఏమో చేస్తారని ప్రగల్భాలు పలుకుతున్నారని హరీశ్ మండిపడ్డారు. చంద్రబాబు పాలనలో తెలంగాణ దోపిడీకి గురైందని ఆరోపించారు. తెలంగాణ ప్రజలకు చంద్రబాబుపై స్పష్టత ఉందని తెలిపారు.

 

తెలంగాణలో ఫ్లోరోసిస్‌‌ను పారద్రోలినట్లుగా చంద్రబాబు చెప్పడం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. రైతు ఆత్మహత్యలు జరిగింది చంద్రబాబు హయాంలోనేనని గుర్తుచేశారు. బషీర్‌బాగ్ చేదు జ్ఞాపకాలు ప్రజలు ఇంకా మరిచిపోలేదని చెప్పుకొచ్చారు. అసలు ఈ ప్రాంతం గురించి మాట్లాడే అర్హతకు చంద్రబాబుకు లేదన్నారు. యువత, ఉద్యోగులు, విద్యార్థులు, రైతులు, అన్నివర్గాలను, ఈ ప్రాంతానికి తీవ్రమైన అన్యాయం చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడని ధ్వజమెత్తారు. నాటి యువత మాకు ఉద్యోగాలు కావాలి, మా పల్లెలు అభివృద్ధి కావాలని అడిగితే వారిని నక్సలైట్ల పేరుతో కాల్చి చంపిన చరిత్ర బాబుదని హరీశ్ గుర్తు చేశారు.