ఉపాధి హామీ పథకంలో భాగంగా రైతులు నిర్మించుకున్న పంట ఆరబోత కల్లాలపై కేంద్ర ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నదని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. రైతులకు అనేక విధాలుగా ఉపయోగపడే ఈ కల్లాల నిర్మాణంపై కావాలనే కేంద్ర ప్రభుత్వం రాద్ధాంతం చేస్తుందని ఆరోపించారు. ఇంత మంచి కార్యక్రమం కోసం రైతులకు తెలంగాణ ప్రభుత్వం చేసిన సహాయాన్ని ఉపాధి హామీ నిధుల మళ్లింపు అంటూ దుష్ప్రచారం చేస్తోందని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం రైతుల ప్రయోజనాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నందుకు, రాష్ట్రంపై అసత్య ప్రచారం చేస్తున్నందుకు శుక్రవారం అన్ని జిల్లాల కేంద్రాల్లో ధర్నా కార్యక్రమాలు నిర్వహించాలని పార్టీ నేతలకు పిలుపునిచ్చారు.

 

ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయ కార్యక్రమాలకు అనుసంధానం చేయాలని తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే పదుల సార్లు విజ్ఞప్తి చేసిన విషయాన్ని కేటీఆర్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటు ప్రభుత్వం తరఫున పలుమార్లు కేంద్రానికి లేఖలు సైతం రాశామన్నారు. పార్టీ తరఫున కూడా తీర్మానాలు చేసి కేంద్రానికి పంపించామని కేటీఆర్ చెప్పారు. వ్యవసాయ అనుబంధ పనులను ఉపాధి హామీకి అనుసంధానం చేయడం పక్కనపెట్టి మొత్తం పథకాన్ని నీరు కార్చేలా అనేక షరతులు, కోతలను కేంద్ర ప్రభుత్వం కొత్తగా చేర్చిందన్నారు.