డ్రగ్స్ టెస్టుల విషయం ఇప్పుడు మంత్రి కేటీఆర్, బీజేపీ మధ్య పరస్పర విమర్శలు, సవాళ్లకు వేదికైంది. తనపై వచ్చిన డ్రగ్స్ ఆరోపణలపై మంత్రి కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేస్తూ, బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కి సవాల్ విసిరారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మంత్రి కేటీఆర్ కు ఘాటైన కౌంటర్ ఇచ్చారు. దొంగలు పడ్డ ఆరు నెలలకు ఇప్పుడు మొరగడం ఏంటని సూటిగా మంత్రి కేటీఆర్ ని ప్రశ్నించారు. డ్రగ్స్ పై తాను సవాల్ చేసినప్పుడు స్పందించకుండా..ఇప్పుడా మాట్లాడేది అని ఆగ్రహం వ్యక్తం చేశారు. విదేశాలకు వెళ్లి కేటీఆర్ ట్రీట్మెంట్ చేయించుకుని వచ్చి.. ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నారని ఆరోపించారు. ఎప్పుడో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సవాల్ విసిరితే.. ఇప్పుడు రియాక్ట్ కావడం ఏంటని ఎద్దేవా చేశారు. అసలు మంత్రి కేటీఆర్ లిక్కర్ కేసు గురించి ఎందుకు మాట్లాడటం లేదని బండి సంజయ్ నిలదీశారు.

 

మంత్రి కేటీఆర్ డిప్రేషన్ లో వున్నారని, ఆయన మొహంలో భయం కనిపిస్తోందన్నారు. డ్రగ్స్ కేసుపై దర్యాప్తు చేయకుండా ప్రభుత్వం ఎందుకు ఆపేసిందో సమాధానం చెప్పాలని..దీని వెనక ఎవరున్నారని ప్రశ్నించారు. దమ్ముంటే సిట్ నివేదికను బయట పెట్టాలని డిమాండ్ చేశారు. ఏం తప్పులేకుంటే డ్రగ్స్ కేసును ఎందుకు ఆపేశారని నిలదీశారు.తాను తంబాకు తింటున్నట్లు మంత్రి కేటీఆర్ వద్ద ఏమైనా ఆధారాలు వున్నాయా? అని బండి సంజయ్ ప్రశ్నించారు. సీఎం కాక మునుపే ఇలా మాట్లాడితే.. తెలంగాణలో పేదోళ్ల పరిస్థితి ఏమవుతుందని అన్నారు. మంత్రి కేటీఆర్ కి బూతులు తిట్టడం తప్ప, ఏమీ రాదని, హైదరాబాద్ డ్రగ్స్ కేసును పూర్తి స్థాయిలో విచారణ జరపాలని డిమాండ్ చేశారు.

తనపై వచ్చిన డ్రగ్స్ ఆరోపణలపై మంత్రి కేటీఆర్ ఘాటుగా స్పందించారు. తాను ఏ పరీక్షకైనా సిద్ధమేనని వేములవాడ వేదికగా ప్రకటించారు. ఈ మేరకు బీజేపీ నేతలకు కేటీఆర్ సవాల్ విసిరారు. డ్రగ్స్ పరీక్షకు రక్తంతో పాటు అవసరమైతే జుట్టు, గోళ్లు, కిడ్నీలు కూడా ఇస్లానని, ఏ డాక్టర్ ను పంపినా తాను సిద్ధంగానే వున్నానని ప్రకటించారు. తాను ఏ దోషం లేకుండా బయటకు వస్తానని, అప్పుడు కరీంనగర్ చౌరస్తాలో మీ చెప్పుతో మీరే కొట్టుకునేందుకు సిద్ధమా? అంటూ కేటీఆర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కి సవాల్ విసిరారు. భైంసాను దత్తత తీసుకుంటామని బండి సంజయ్ ప్రకటించారని, తన సొంత పార్లమెంట్ నియోజకవర్గంలోని సిరిసిల్ల నేత కార్మికుల కోసం 8 సంవత్సరాలుగా మెగా పవర్ లూం క్లస్టర్ అడుగుతుంటే ఎందుకు తేలేకపోతున్నారని నిలదీశారు.