తెలంగాణ కాంగ్రెస్ లో తలెత్తిన సంక్షోభాన్ని పరిష్కరించడానికి హైకమాండ్ అడుగులు వేసింది. ఉమ్మడి ఏపీ సమయంలో రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జీగా వున్న సీనియర్ నేత, ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ ని రంగంలోకి దింపింది. సీనియర్లు, జూనియర్ల మధ్య తలెత్తిన విభేదాలను పరిష్కరించే బాధ్యతను ఆయనపై మోపింది. అంతేకాకుండా కాంగ్రెస్ హైకమాండ్ దిగ్విజయ్ కోసం ఓ ప్రత్యేక పోస్టును కూడా క్రియేట్ చేసింది. దిగ్విజయ్ సింగ్‌కు టీ కాంగ్రెస్ అడ్వయిజర్ బాధ్యతను అప్పజెప్పింది. ఈ నేపథ్యంలో త్వరలో టి.కాంగ్రెస్ నేతలతో దిగ్విజయ్ సింగ్ సమావేశ కానున్నారు.

 

కొత్తగా వేసిన పీసీసీ కమిటీలు తెలంగాణ కాంగ్రెస్ లో చిచ్చు రాజేశాయి. తమని కాదని జూనియర్లకు, టీడీపీ నుంచి వచ్చిన వారికే అధిక ప్రాధాన్యం కల్పించారంటూ ఏకంగా 13 మంది తమ పీసీసీ పదవులకు రాజీనామా చేసేశారు. ఇది సీనియర్ నేత కొండా సురేఖ నుంచి ప్రారంభమైంది. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి టీడీపీ నుంచి కాంగ్రెస్ లోకి వచ్చిన వారికే పదవులు ఇప్పించుకున్నారని మండిపడ్డారు. ఇక… సీనియర్లందరూ వేరు కుంపటి పెట్టుకున్నారు. రేవంత్ ను బాయ్ కాట్ చేస్తున్నామని, తామే అసలైన కాంగ్రెస్ నేతలమని ప్రకటించారు. పీసీసీ పదవుల విషయంపై ఢిల్లీలోనే తెల్చుకుంటామని ప్రకటించారు. దీంతో జూనియర్లు కొందరు రేవంత్ కు మద్దతుగా నిలుస్తున్నారు. దీంతో కాంగ్రెస్ రెండుగా చీలిపోయింది. ఈ నేపథ్యంలోనే డిగ్గీరాజాను అధిష్ఠానం రంగంలోకి దింపింది.