కాంగ్రెస్ వార్ రూమ్ లో సైబర్ పోలీసులు సోదాలు జరపడంపై కాంగ్రెస్ తీవ్రంగా మండిపడింది. దీనిని నిరసిస్తూ గాంధీ భవన్ దగ్గర కాంగ్రెస్ నేతలు దీక్షకు దిగారు. అంతేకాకుండా ప్రగతి భవన్ ముట్టడికి కూడా సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో గాంధీ భవన్ వద్ద భారీగా పోలీసులను మోహరించారు. కాంగ్రెస్ కార్యకర్తలు సీఎం కేసీఆర్ దిష్టి బొమ్మను దగ్ధం చేస్తూ… వ్యతిరేక నినాదాలు చేశారు. అనంతరం ప్రగతి భవన్ ముట్టడికి సిద్ధం కాగా.. పోలీసులు వారిని గాంధీ భవన్ వద్దే అడ్డుకున్నారు. దీంతో పోలీసులు కాంగ్రెస్ నేతల మధ్య వాగ్వాదం, ఘర్షణ జరిగింది. పోలీసులు అడుగడుగునా అడ్డుకోవడంతో పార్టీ నాయకులు గాంధీ భవన్ వద్ద దీక్ష చేపట్టారు.

సోషల్ మీడియా వేదికగా సీఎం కేసీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని, ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నారని, మాదాపూర్ లోని కాంగ్రెస్ వార్ రూమ్ కేంద్రంగా ఇదంతా జరుగుతోందని సైబర్ క్రైమ్ పోలీసులకు సమాచారం అందింది. దీంతో సైబర్ క్రైమ్ పోలీసులు కాంగ్రెస్ వ్యూహకర్త సునీల్ కనుగోలు కార్యాలయానికి పోలీసులు మఫ్టీలో వెళ్లారు. అక్కడంతా సమాచారాన్ని సేకరించారు. ఈ విషయం కాంగ్రెస్ నేతలకు తెలిసింది. దీంతో తమ పార్టీ కార్యాలయానికి ఎందుకు వచ్చారని, నోటీసులు చూపించాలని డిమాండ్ చేశారు. పోలీసులకు వ్యతిరేకంగా నేతలు నినాదాలు చేశారు. ఆ తర్వాత కంప్యూటర్లను పోలీసులు తీసుకెళ్లారు.