ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో 2,500 రూపాయల నుంచి పెన్షన్ ను 2,750 కి పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీని వల్ల ప్రభుత్వానికి 134 కోట్లు అదనంగా ఖర్చవుతుందని, కానీ.. 62.31 లక్షల మంది పెన్షన్ దార్లకు లాభం చేకూరుతుందని పేర్కొంది. జనవరి 1 నుంచి కొత్త పెన్షన్ అములలోకి వస్తుందని కేబినెట్ పేర్కొంది. సీఎం జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన ఏపీ కేబినెట్ మంగళవారం భేటీ అయ్యింది. ఈ సందర్బంగా పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. వైఎస్సార్ పశుబీమా పథకం ప్రతిపాదనలకు కూడా కేబినెట్ ఓకే చెప్పింది.
అలాగే బాపట్ల, పల్నాడు అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీలను ఏర్పాటు చేసేందుకు కూడా కేబినెట్ సుముఖత వ్యక్తం చేసింది. 1301 చ.కి.మీ. విస్తీర్ణంలో 2 మున్సిపాలిటీలు, 101 గ్రామాలతో బాపట్ల అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీని ఏర్పాటు చేయనున్నారు. 8 మున్సిపాలిటీలు, 28 మండలాల్లోని 349 గ్రామాలతో 7,281 చ.కి.మీ. పరిధితో పల్నాడు అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ నెలకొల్పనున్నారు. కొత్తగా ఏర్పాటు కానున్న ఏపీ జ్యుడిషియల్ అకాడమీలో 55 పోస్టుల భర్తీకి ఏపీ కేబినెట్ ఓకే చెప్పింది.












