భారత సైనికులు ఎవరూ చనిపోలేదు… తీవ్రంగా గాయపడలేదు : తవాంగ్ ఘటనపై రాజ్‌నాథ్‌ సింగ్‌

అరుణాచల్‌ ప్రదేశ్‌లోని తవాంగ్ సెక్టార్‌లో భారత్, చైనాల మధ్య చోటుచేసుకున్న ఘర్షణలపై లోక్ సభలో రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ప్రకటన చేశారు. ఈ ఘర్షణలో భారత సైనికులకు తీవ్ర గాయాలు కాలేదని, ఎవరూ చనిపోలేదని స్పష్టం చేశారు. సరైన సమయంలో కమాండర్ల జోక్యంతో పీఎల్ఏ సైనికులు వెనక్కి వెళ్లిపోయారని పేర్కొన్నారు. అరుణాచల్ ప్రదేశ్ లోని తవాంగ్ సెక్టార్ లో ఎల్ఏసీని అతిక్రమించి, ప్రస్తుత పరిస్థితిని మార్చేసేందుకు చైనా ప్రయత్నించినందని మండిపడ్డారు. ఈ క్రమంలో దేశ భూభాగంలోకి చొచ్చుకొచ్చేందుకు ప్రయత్నించిన చైనా బలగాల దుశ్చర్యను భారత సేనలు దీటుగా తిప్పికొట్టాయని ప్రకటించారు.

చైనా పీఎల్ఏ సైనికులు భారత భూభాగంలోకి చొచ్చుకొచ్చేందుకు ఈ నెల 9 న ప్రయత్నించాయని, ప్రస్తుత పరిస్థితిని మార్చేందుకు ప్రయత్నించాయని రాజ్ నాథ్ వివరించారు. అయితే.. వారి ప్రయత్నాలను భారత సైన్యం దీటుగా తిప్పికొట్టిందన్నారు. చైనా సైనికులను తిరిగి తమ పోస్ట్ వైపు వెళ్లిపోయేలా చేశారని వివరించారు. మన దళాలు మన దేశ సరిహద్దులను కాపాడటానికి నిబద్ధతతో కట్టుబడి ఉన్నాయని చెప్పారు. సరిహద్దుల్లోని యథాతథ స్థితిని సవాల్ చేసి, మార్చేందుకు జరిగే ప్రయత్నాలను దీటుగా తిప్పికొట్టడానికి మన దళాలు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నాయని రాజ్ నాథ్ సింగ్ తెలిపారు.

Related Posts

Latest News Updates