తెలుగువారికి సుప్రసిద్ధ ఆధ్యాత్మిక గురువు, ఒక యోగి ఆత్మకథ రచయిత పరమహంస యోగానంద 105 సంవత్సరాల క్రితం స్థాపించిన యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా (వైఎస్ఎస్) శుభవార్తను అందించింది. యోగానంద ఆత్మసాక్షాత్కార సాధనా పాఠాలైన క్రియా యోగ పాఠముల తెలుగు అనువాదాన్ని వైఎస్ఎస్ ఉపాధ్యక్షులు ఉపాధ్యక్షులు స్మామి స్మరణానంద మరియు బ్రహ్మచారి కేదారానంద్ జీ శనివారం విడుదల చేశారు. బేగంపేటలోని యోగదా సత్సంగ ధ్యానకేంద్రంలో ఈ పాఠాల ఆవిష్కరణ జరిగింది. ఆధ్యాత్మిక సాహిత్యంలో అత్యధికంగా అమ్ముడవుతున్న రచన ఒక యోగి ఆత్మకథతో పరమహంస యోగానంద లక్షలాది మందికి యోగా, ధ్యానాన్ని పరిచయం చేశారు. ఆయన బోధనలలో అంతర్గతంగా క్రియాయోగ పవిత్ర శాస్త్రం, రాజయోగం యొక్క స్వరూపము ఉంది.

వై.ఎస్.ఎస్. పాఠాల ద్వారా జీవితాన్ని మార్చడానికి, సమతుల్యతను తీసుకురావడానికి ధ్యానం ద్వారా పవిత్రమైన క్రియాయోగ శాస్త్రాన్ని నేర్చుకోవచ్చని స్మరణానంద తెలిపారు. యోగదా సత్సంగ పాఠాల కోసం దరఖాస్తు చేసుకోవడం మొదటి దశ అని తెలియజేస్తూ yssi.org/Lessons లింక్ నుంచి ఇవి పొందవచ్చన్నారు. ఈ పాఠాల ద్వారా మొదటి సంవత్సరంలో, విద్యార్థులు ధ్యానానికి సంబంధించి మూడు ప్రాథమిక ప్రక్రియలను, పరమహంస యోగానంద సమతుల్య ఆధ్యాత్మిక జీవనం సూత్రాలను నేర్చుకుంటారని చెప్పారు. వైఎస్ఎస్. పాఠాలలో సంతులిత ఆధ్యాత్మిక-జీవన కళ; యోగం: భగవంతుణ్ణి తెలుసుకొనే సార్వత్రిక శాస్త్రం; ఆరోగ్యానికి, స్వస్థపరచడానికి సంబంధించిన యోగ సూత్రాలు; వెన్నెముకలో చక్రాలను జాగృతి చెయ్యడం; ప్రార్థన ద్వారా భగవంతునితో అనుసంధానం; జీవితం-మరణం-కర్మ, పునర్జన్మ తదితర అంశాలున్నాయి.

వై.ఎస్.ఎస్. పాఠాలు ఒక వ్యక్తి జీవితంలోని అన్ని పార్శ్వాలనూ ఉద్ధరించే, పరివర్తన చేసే శక్తిని కలిగి ఉన్న పవిత్రమైన జ్ఞాన ప్రసారాన్ని ఏర్పరుస్తాయని, ఇవి ప్రఖ్యాత యోగ గురువులు మహావతార్ బాబాజీ, లాహిరీ మహాశయులు, స్వామి శ్రీయుక్తేశ్వర్, పరమహంస యోగానంద వంటి ప్రఖ్యాత గురు పరంపర ద్వారా అందించబడిన ధ్యాన పద్ధతులని స్మరణానంద వివరించారు. ఇది సనాతన ధర్మం సారాంశాన్ని బోధించే ప్రగతిశీల, గృహ-అధ్యయన కార్యక్రమమని, ఇప్పుడు ప్రతి సత్యాన్వేషికీ అందుబాటులో ఉందని ఆయన తెలిపారు. ప్రక్రియలతో పాటుగా, ఈ పాఠాలు ఆధ్యాత్మిక జీవనం కోసం అమూల్యమైన స్ఫూర్తిని, ఆచరణాత్మక మార్గదర్శకత్వాన్ని (ఈ మారుతున్న ప్రపంచంలోని ఎడతెగని సవాళ్లు మరియు అవకాశాల మధ్య ఆనందంగా మరియు విజయవంతంగా జీవించడం ఎలాగో తెలుసుకోవడం కోసం) అందిస్తాయని, ఈ పాఠాలు విద్యార్థికి ఆ స్ఫూర్తిని రోజువారీ ఆధ్యాత్మిక సాధనగా పరివర్తన చేసుకోవడాన్ని బోధిస్తాయని అన్నారు.
మరింత సమాచారం కోసం: yssi.org/Lessons
06516655555, నెంబర్‌కు ఫోన్ చేసి కూడా సమాచారం పొందవచ్చు.