తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ వైద్యవిద్యపై ప్రత్యేక దృష్టి సారించారని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు స్పష్టం చేశారు. 33 జిల్లాల్లో 33 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఇప్పటికే పలు జిల్లాల్లో మెడికల్ కాలేజీలు ప్రారంభమయ్యాయని హరీశ్‌రావు తెలిపారు. సిద్దిపేట మెడికల్ కళాశాలలో మొదటి పీజీ బ్యాచ్ (2022-23) జీజీ స్టూడెంట్స్ ఇంట్రడక్షన్ ప్రోగ్రాంలో మంత్రి హారీశ్‌రావు పాల్గొన్నారు.

ఉస్మానియా లాంటి కాలేజీలకే సంవత్సరానికి మూడు లేదా నాలుగు పీజీ సీట్లు వస్తాయి. కానీ మొదటి సంవత్సరంలోనే సిద్దిపేట మెడికల్ కాలేజీకి రికార్డ్ స్థాయిలో 57 పీజీ సీట్లు సాధించామని గుర్తు చేశారు. పీజీ మెడికల్ సీట్ల సాధనలో మెడికల్ కాలేజ్ ప్రిన్సిపాల్, ప్రొఫెసర్ల కృషి చాలా ఉందని ప్రశంసించారు. సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో రోజు 500 నుండి 600 మంది అవుట్ పేషెంట్స్ వస్తున్నారని, త్వరలోనే సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో క్యాథలాగ్, కీమోథెరపీ, రేడియో థెరపీ సేవలను ప్రారంభిస్తామని ప్రకటించారు. సిద్దిపేట ప్రభుత్వ మెడికల్ కాలేజీలో మొదటి పీజీ బ్యాచ్ ఇదే కాబట్టి, చరిత్రలో నిలిచేలా అందరూ డిస్టింక్షన్ సాధించి రాబోవు తరాల విద్యార్థులకు ఆదర్శంగా నిలవాలని మంత్రి ఆకాంక్షించారు.
అన్ని రంగాలలో సిద్దిపేట ఆదర్శంగా నిలుస్తున్న మాదిరిగానే వైద్య విద్యలో కూడా జాతీయస్థాయిలో రోల్ మోడల్ గా నిలపాలని మంత్రి హరీశ్ పిలుపునిచ్చారు. కాలేజీలో ర్యాగింగ్ చేయకుండా జూనియర్లతో స్నేహపూర్వకంగా మెలగాలి. వారు వైద్య విద్యలో విజయవంతంగా రాణించేలా సలహాలు ఇవ్వాలని మంత్రి సూచించారు. పీజీ అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సేవలు అందించడానికి సిద్ధంగా ఉండాలని మంత్రి విద్యార్థులకు సూచించారు.