షార్ట్ కట్ రాజకీయాలపై ప్రధాని నరేంద్ర మోదీ మహారాష్ట్ర పర్యటనలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశ ఆర్థిక వ్యవస్థను నాశనం చేసేందుకు కొన్ని రాజకీయ పార్టీలు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. దేశానికి సుస్థిరమైన అభివృద్ధే శ్రీరామ రక్ష అని, షార్ట్ కట్ రాజకీయాలతో అభివృద్ధి సాధ్యం కాదని తేల్చి చెప్పారు. ప్రధాని మోదీ ఆదివారం మహారాష్ట్రలో పర్యటించారు. ఈ సందర్భంగా నాగపూర్- బిలాస్ పూర్ మధ్య వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలు, నాగపూర్- ముంబై మధ్య ఎక్స్ ప్రెస్ హైవే, నాగపూర్ మెట్రో రైల్ తొలిదశ, ఎయిమ్స్ ను ప్రారంభించారు.

ఆ తర్వాత ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మోదీ ప్రసంగించారు. ప్రజలు షార్ట్ కట్ పొలిటీషియన్లను తిరస్కరించాలని, అవినీతి నేతల బండారం బయటపెట్టాలని పిలుపునిచ్చారు. ‘‘షార్ట్ కట్ లీడర్లు ప్రజలు పన్నుల రూపంలో కట్టే డబ్బును దోచుకుంటారు. తప్పుడు హామీలతో అధికారాన్ని చేజిక్కించుకుంటారు. ఇలాంటి పాలిటిక్స్ తో దేశం అభివృద్ధి చెందదు. అందుకే షార్ట్ కట్ లీడర్ల పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలి” అని ప్రధాని హెచ్చరించారు.

నాగ్ పూర్ ఎయిర్ పోర్టుకు చేరుకున్న ప్రధాని మోడీకి డోలు వాయిద్యాలతో ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ప్రధాని కూడా కళాకారులతో కలిసి ఉత్సాహంగా డోలు వాయించారు. అనంతరం మెట్రో రైల్ ప్రాజెక్టును ప్రారంభించిన సందర్భంగా జీరో మైల్ ఫ్రీడం పార్క్ స్టేషన్ లో టికెట్ కొని ఖాప్రి స్టేషన్ వరకూ మెట్రోలో ప్రయాణించారు. రైళ్లో తనతో పాటు ప్రయాణించిన ఎయిమ్స్ విద్యార్థులు, తదితరులతో ముచ్చటించారు. సమృద్ధి ఎక్స్ ప్రెస్ వేను ప్రారంభించిన తర్వాత కూడా మోడీ కారులో పది కిలోమీటర్ల దూరం ప్రయాణించారు.












