టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సీబీఐ విచారణ ముగిసింది. ఆదివారం దాదాపు 7 గంటల పాటు ఢిల్లీ లిక్రర్ స్కాం విషయంలో సాక్షిగా కవిత వాంగ్మూలాన్ని సీబీఐ నమోదు చేసింది. ఆదివారం ఉదయం 11 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకూ సీబీఐ అధికారులు కవితను ప్రశ్నించారు. మధ్యాహ్నం ఓ గంట పాటు లంచ్ కోసం విరామం ఇచ్చారు. ఆ తర్వాత మళ్లీ విచారణను ప్రారంభించారు. ఈ సందర్భంగా కవిత ఇచ్చిన వాంగ్మూలాన్ని అధికారులు రికార్డు కూడా చేసుకున్నారు. సీఆర్పీసీ 161 సెక్షన్ కవిత స్టేట్ మెంట్ ను రికార్డు చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో దక్షిణాది లాబీయింగ్ గురించి కవితను అడిగినట్లు తెలుస్తోంది. అలాగే ఇప్పటికే అరెస్టైన శరత్ చంద్రారెడ్డి, బోయినపల్లి అభిషేక్, నిందితుడు రామచంద్ర పిళ్లైతో పరిచయాలు, వ్యాపార సంబంధాలపై కూడా సీబీఐ కవితను వివరాలు అడిగింది. ముందే సిద్ధం చేసుకొని వచ్చిన ప్రశ్నలనే సీబీఐ అడిగినట్లు తెలుస్తోంది. ఈ విచారణ అనంతరం సీబీఐ అధికారుల టీమ్ తిరిగి ఢిల్లీకి వెళ్లిపోయింది.
ఈ విచారణ అనంతరం పలువురు నేతలు, కార్యకర్తలు కవిత నివాసానికి చేరుకున్నారు. వారందరికీ కవిత అభివాదం చేశారు. ఆ తర్వాత మంత్రి తలసానితో కలిసి ఎమ్మెల్సీ కవిత ప్రగతి భవన్ కు వెళ్లారు. అక్కడ సీఎం కేసీఆర్ తో సమావేశమయ్యారు. సీబీఐ విచారణ గురించి సీఎంకి కేసీఆర్ వివరించారు.