సింగరేణి విషయంలో టీఆర్ఎస్ అసత్యపు ప్రచారాలను చేస్తోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. సింగరేణిని కల్వకుంట్ల కంపెనీగా మార్చేందుకు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మాట్లాడారు. బొగ్గు గనుల వేలంపై కల్వకుంట్ల కుటుంబ సభ్యులు అసత్య ప్రచారాలు చేస్తున్నారని, తెలంగాణ ప్రభుత్వానికి 2015 లో కేటాయించిన 3 కోల్ బ్లాక్ లు సింగరేణి సంస్థ వెనక్కి ఇచ్చేసిందన్నారు. వెనక్కి ఇవ్వడం రూల్స్ కి విరుద్ధమైనా… కేంద్రం ఎలాంటి జరిమానా విధించలేదని వెల్లడించారు. బొగ్గు ఉత్పత్తిలో దేశం నాలుగో స్థానంలో వుందని, బొగ్గ గనులు ఓపెన్ యాక్షన్ ద్వారా ఇవ్వాలని కేంద్రం నిర్ణయం తీసుకుందన్నారు.
సింగరేణిని ప్రైవేటీకరించే అధికారం కేంద్రానికి లేదని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మరసారి స్పష్టం చేశారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తుందని .. ప్రధాని మోడీ కూడా సింగరేణి ప్రైవేటీకరణపై క్లారిటీ ఇచ్చారన్నారు. సింగరేణిని ప్రైవేటీకరిస్తున్నారని కేసీఆర్ కుటుంబం విష ప్రచారం చేస్తుందని ఆరోపించారు. బీజేపీని ప్రజలు ఆదరించడాన్ని కేసీఆర్ సహించలేకపోతున్నారని అన్నారు.