బాసర ట్రిపుల్ ఐటీ స్నాతకోత్సవానికి మంత్రి కేటీఆర్ హాజరయ్యారు. ఆయనతో పాటు మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి కూడా హాజరయ్యారు. ఆర్జీయూకేటీలో టీ-హబ్ ఏర్పాటుకు టీ-హబ్ ప్రతినిధులు, ఆర్జీయూకేటీ అధికారుల మధ్య ఒప్పందం జరిగింది. ఈ సందర్భంగా 2,200 మంది విద్యార్థులకు ల్యాప్ టాప్ లు, యూనిఫామ్ అందజేశారు. గత పర్యటన సందర్భంగా తామిచ్చిన హామీలు పురోగతిపై మంత్రి కేటీఆర్ అధికారులతో చర్చించారు. క్యాంపస్‌లో విద్యార్థులకు ఎలాంటి సమస్యలు లేకుండా చూడాలని మంత్రి అధికారులను ఆదేశించారు.

ట్రిపుల్ ఐటీకి సీఎం కేసీఆర్ అత్యంత ప్రాధాన్యమిస్తున్నారని చెప్పారు. సాంకేతిక యుగంలో అవకాశాలకు కొదువ లేదని మంత్రి కేటీఆర్ అన్నారు. విద్యార్థులు సృజనతో ఎదిగేందుకు కృషి చేయాలని సూచించారు. ప్రపంచంతో పోటీపడగలిగే సత్తా సంతరించుకోగలిగితే ఆపగలిగేవారు ఉండరని చెప్పారు. కంప్యూటర్లే మానవ మేథస్సును అధ్యయనం చేస్తున్నాయన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్, మిషన్ లెర్నింగ్ కీలక పాత్రపోషిస్తున్నాయని చెప్పారు.

ఉన్నత విద్యాలయాల్లో మౌలికవసతుల కల్పనకు ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఉన్నత విద్యాసంస్థలను మరింత మెరుగ్గా తీర్చిదిద్దాలని సీఎం కేసీఆర్ ఆదేశించారని తెలిపారు. విద్యార్థులకు ప్రాక్టికల్ నాలెడ్జ్ ముఖ్యమని చెప్పారు. టీహబ్‌తో బాసర ట్రిపుల్ ఐటీ ఒప్పందం కుదుర్చుకుందని వెల్లడించారు. దేశంలో మొట్టమొదటి ప్రైవేట్ శాటిలైట్ పంపింది హైదరాబాద్ టీ హబ్ కంపెనీయేనని గుర్తుచేశారు. పది మందికి ఉపాధి కల్పించే స్థాయికి మనం ఎదగాలని చెప్పారు.