హైదరాబాద్ మెట్రో రెండో దశకు సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు. నాగోల్-రాయదుర్గం కారిడార్-3 కి కొనసాగింపుగా రాయదుర్గం నుంచి శంషాబాద్ విమానాశ్రయం వరకూ నిర్మించే ఎయిర్ పోర్టు ఎక్స్ ప్రెస్ మెట్రోకు మైండ్ స్పేస్ సర్కిల్ వద్ద సీఎం ప్రత్యేక పూజలు చేసి, పునాది రాయి వేశారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సోమేశ్ కుమార్‌, మంత్రులు కేటీఆర్‌, మ‌హ‌ముద్ అలీ, సబిత, త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్, వేముల ప్ర‌శాంత్ రెడ్డి, మ‌ల్లారెడ్డి, ఎంపీలు కేశ‌వ‌రావు, రంజిత్ రెడ్డి, జీహెచ్ఎంసీ మేయ‌ర్ గ‌ద్వాల్ విజ‌య‌ల‌క్ష్మి తదితరులు పాల్గొన్నారు.

మెట్రో రెండోదశ విస్తరణలో భాగంగా రాయదుర్గం నుంచి శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు (31 కి.మీ.) వరకు కేవలం 26 నిమిషాల్లో ప్రయాణించేలా హైదరాబాద్‌ మెట్రో రైల్‌ ఏర్పాట్లు చేస్తున్నది. విమానాశ్రయానికి త్వరగా చేరేందుకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నది. పిల్లర్లతోపాటు 2.5 కిలోమీటర్ల మేర భూగర్భంలో రైలు మార్గాన్ని నిర్మించనున్నది. అవుటర్‌ రింగ్‌రోడ్డు వెంట నిర్మించే ఈ మార్గంలో 120 కి.మీ వేగంతో ప్రయాణించేలా ఎయిరో డైనమిక్‌ టెక్నాలజీని వినియోగించనున్నారు.