టీఆర్ఎస్ బీఆర్ఎస్ (భారత రాష్ట్ర సమితి) గా మారింది. టీఆర్ఎస్‌ను భార‌త్ రాష్ట్ర స‌మితిగా మారుస్తూ ఈసీ నిర్ణ‌యం తీసుకుంది. ఈ మేర‌కు ఎన్నిక‌ల సంఘం ఆమోదం తెలిపింది. పార్టీ మార్పున‌కు సంబంధించి కేంద్ర ఎన్నిక‌ల సంఘం నుంచి కేసీఆర్‌కు అధికారికంగా లేఖ అందింది. దీంతో పార్టీ నాయ‌కులు, శ్రేణులు హర్షం వ్య‌క్తం చేస్తున్నారు. టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్‌గా మార్చాల‌ని దసరా రోజున ముఖ్య‌మంత్రి కేసీఆర్ పార్టీ త‌రఫున కేంద్ర ఎన్నిక‌ల సంఘానికి లేఖ రాసిన విష‌యం విదిత‌మే. తెలంగాణ రాష్ట్ర స‌మితి పేరునే భార‌త రాష్ట్ర స‌మితిగా మారుస్తూ తెలంగాణ భ‌వ‌న్ వేదిక‌గా కేసీఆర్ అధికారిక‌ ప్ర‌క‌ట‌న చేశారు. టీఆర్ఎస్ పేరును మారుస్తూ ద‌స‌రా రోజున‌ నిర్వ‌హించిన పార్టీ స‌ర్వ‌స‌భ్య స‌మావేశంలో తీర్మానం చేశారు. ముఖ్య‌మంత్రి కేసీఆర్‌తో పాటు 283 మంది టీఆర్ఎస్ ప్ర‌తినిధులు ఆ తీర్మానంపై సంత‌కం చేశారు.

 

తెలంగాణ రాష్ట్ర స‌మితి భార‌త రాష్ట్ర స‌మితిగా మారిన నేప‌థ్యంలో రేపు తెలంగాణ భ‌వ‌న్‌లో ఆ పార్టీ ఆవిర్భావ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించ‌నున్నారు. మ‌ధ్యామ్నం 1:20 గంట‌ల‌కు ముఖ్య‌మంత్రి కేసీఆర్ అధ్య‌క్ష‌త‌న ఈ కార్య‌క్ర‌మం జ‌ర‌గ‌నుంది. ఈ వేదిక నుంచి బీఆర్ఎస్ జెండాను కేసీఆర్ ఆవిష్క‌రించ‌నున్నారు. బీఆర్ఎస్ ఆవిర్భావ కార్య‌క్ర‌మంలో భారీ ఎత్తున పార్టీ శ్రేణులు పాల్గొనాల‌ని కేసీఆర్ పిలుపునిచ్చారు.