జగిత్యాల సమీకృత కలెక్టరేట్‌ ను ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రారంభోత్సవం చేశారు. కార్యాలయానికి వచ్చిన సీఎంకు అధికారులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పోలీసులు గౌరవ వందనం సమర్పించారు. అనంతరం కార్యాలయాన్ని కేసీఆర్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం చాంబర్ లోని సీట్లో కలెక్టర్ రవిని కూర్చోబెట్టి, సీఎం శుభాకాంక్షలు తెలిపారు. ఎస్సారెస్పీ ఆబాది స్థలం 20 ఎకరాల్లో సమీకృత జిల్లా కార్యాలయాలన్ని రూ.49.20 కోట్ల వ్యయంతో నిర్మించింది. ఎనిమిది ఎకరాల్లో కలెక్టర్‌, అదనపు కలెక్టర్‌, జిల్లా రెవెన్యూ అధికారి క్యాంపు కార్యాలయాలను నిర్మించింది. వీటిని 6వేల చదరపు అడుగుల్లో జిల్లా కలెక్టర్‌ క్యాంపు కార్యాలయం.. 2,877 చదరపు అడుగులలో అదనపు కలెక్టర్‌ క్యాంపు కార్యాలయం, 2130 చదరపు అడుగులలో జిల్లా రెవెన్యూ అధికారి క్యాంపు కార్యాలయాన్ని నిర్మించారు. ఇక జీప్లస్‌ 2 పద్ధతిలో 19,300ల చదరపు అడుగుల విస్తీర్ణంలో జిల్లా స్థాయి అధికారుల గృహ సముదాయాలను నిర్మించారు.

ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడారు. మంచి చ‌క్క‌టి ప‌రిపాల‌న భ‌వ‌నాన్ని నిర్మించుకుని, తన చేతుల మీదుగా ప్రారంభించుకున్నందుకు సంతోషంగా వుందని అన్నారు. ఈ సందర్భంగా అధికారులకు, మంత్రులకు, ఎమ్మెల్యేలకు సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలియజేశారు. ధ‌నిక రాష్ట్రం అవుతుందని ఉద్యమ సమంయలోనే చెప్పానని, అత్యుత్త‌మ శాల‌రీలు వ‌స్తాయ‌ని చెప్పానని గుర్తు చేశారు.. అది నిజ‌మైందని, ఎవ‌ర్నీ వ‌ద‌ల‌కుండా అన్ని వ‌ర్గాలు ప్ర‌తి ఒక్క‌రికి మేలు జ‌రిగే విధంగా కార్య‌క్ర‌మాల‌కు రూప‌క‌ల్ప‌న చేస్తున్నామ‌ని కేసీఆర్ తెలిపారు. ప‌రిపాల‌న చేసే వారు రాజ్య కార్యాన్ని నిర్వ‌హించే వారు న్యాయ మార్గంలో ప‌రిపాలించాలని చెప్పారు. జ‌న‌మంతా సుఖంగా ఉండాల‌ని కోరుకుంటున్నామని తెలిపారు. బేధాభిప్రాయం లేకుండా తెలంగాణ మ‌న‌దే అని చెప్పి అనేక కార్య‌క్ర‌మాలు శ్రీకారం చుట్టామని, అవి విజయవంతం అయ్యాయని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.