జీ 20 అధ్యక్ష బాధ్యతలను భారత్ అధికారికంగా స్వీకరించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన ఢిల్లీలో జీ 20 సన్నాహక సమావేశం జరగనుంది. దీనికి దేశ వ్యాప్తంగా వున్న 40 పార్టీల అధ్యక్షులు హాజరవుతున్నారు. ఇందులో భాగంగా ఏపీ నుంచి సీఎం జగన్, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఢిల్లీ బయల్దేరారు. జీ 20 సన్నాహాక సమావేశాల్లో పాల్గొంటున్నారు. అయితే… తెలంగాణ నుంచి ఎవరు పాల్గొంటున్నారో క్లారిటీ రాలేదు. మోదీ అధ్యక్షతన సాయంత్రం 5 గంటలకు రాష్ట్రపతి భవన్ లో ఈ సమావేశం జరగనుంది. ఇప్పటికే పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి అన్ని పార్టీల అధ్యక్షులకు ఫోన్లు చేసి ఆహ్వానించారు. టీఎంసీ అధ్యక్షురాలు, బెంగాల్ సీఎం మమత కూడా ఈ భేటీకి వస్తున్నారు.
అయితే… జీ 20 లోగోపై బెంగాల్ సీఎం మమతా బెనర్జీ విమర్శలు చేశారు. ఇది రాజకీయ లబ్ధికోసం ప్రధానమంత్రితో జరిగే మీటింగ్స్ కావని గుర్తుచేశారు. కమలం పువ్వు జాతీయ పుష్పం అయినప్పటికీ, అది రాజకీయ పార్టీ లోగో కూడా అని విమర్శించారు. కాబట్టి కమలం పువ్వు గుర్తును జీ20 లోగోగా ఉపయోగించకూడదని అభ్యంతరం వ్యక్తం చేశారు. కమలం పువ్వుకి బదులు ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయని, వాటిని ఎంపిక చేయొచ్చని సూచించారు. జీ20 లోగోకు కమలం పువ్వు గుర్తును ఉంచడంపై దేశంలోని చాలా పార్టీలు విమర్శిస్తున్నాయి.