తెలుగు పీపుల్ ఫౌండేషన్ 14 వ వార్షికోత్సవాలు ఘనంగా జరిగాయి. న్యూజెర్సీలోని జేపీ స్టీవెన్స్ హైస్కూల్ ఇందుకు వేదికైంది. వార్షికోత్సవాల సందర్భంగా వచ్చిన విరాళాలను పేద విద్యార్థుల కోసం ఖర్చు చేస్తున్నామని సంస్థ ప్రకటించింది. ఇంజినీరింగ్, మెడిసిన్, సీఏ వంటి ఉన్నత విద్యను అభ్యసించేందుకు తమ సంస్థ విద్యార్థులకు సాయం చేస్తుందని తెలుగు పీపుల్ ఫౌండేషన్ అధ్యక్షుడు కృష్ణ కోట ప్రకటించారు.
ఇప్పటి వరకు 325 మంది పేద విద్యార్థులకు స్కాలర్షిప్లను స్పాన్సర్ చేసినట్టు వెల్లడించారు. ఇందులో 125 మంది ప్రభుత్వ పాఠశాలలకు చెందిన వాళ్లే ఉన్నారన్నారు. ఇందులో కొంత మంది విద్యార్థులు మెడిసిన్ చేస్తుండగా.. మరికొందరేమో ఐఐటీల్లో విద్యాభ్యాసం చేస్తున్నట్టు తెలిపారు. మరికొందరు చార్టర్డ్ అకౌంటెన్సీ చదువుతుండగా.. ఓ విద్యార్థి సివిల్ సర్వీసెస్‌కు ప్రిపేర్ అవుతున్నట్టు చెప్పారు.