ప్రముఖ బ్యాటరీ సంస్థ అమర్ రాజా తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది. దాదాపు 9,500 కోట్లతో పెట్టుబడులు పెట్టేందుకు తెలంగాణ ప్రభుత్వంతో అమర్ రాజా హైదరాబాద్ వేదికగా ఒప్పందం చేసుకుది. ఈ కార్యక్రమానికి తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్, అమర రాజా సంస్థ చైర్మన్ గల్లా జయదేవ్, ఇతర అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడారు. తెలంగాణలో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చిన అమర రాజా సంస్థకు శుభాకాంక్షలు ప్రకటించారు. 9,500 కోట్లతో అమర రాజా పెట్టుబడులు పెట్టడం అనేది చాలా గొప్ప విషయమని కొనియాడారు. తెలంగాణలో వనరులు పుష్కలంగా వున్నాయని, పారిశ్రామికవేత్తలకు అన్ని వసతులు కల్పిస్తున్నామని గుర్తు చేశారు. 37 ఏండ్లుగా అమ‌ర‌రాజా సేవ‌లందిస్తోందని, ఆ కంపెనీకి పూర్తిగా అండగా వుంటామని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు.

పెట్టుబడుల‌కు తెలంగాణ అనుకూల‌మైన ప్ర‌దేశ‌మ‌ని గ‌ల్లా జ‌య‌దేవ్ పేర్కొన్నారు. నూత‌న సాంకేతిక‌త‌తో బ్యాట‌రీల త‌యారీ యూనిట్‌ను ఏర్పాటు చేయ‌నున్న‌ట్లు వెల్ల‌డించారు. తెలంగాణ‌లో మా సంస్థ ఏర్పాటు చేయ‌డం సంతోషంగా ఉంద‌న్నారు. వ‌చ్చే 10 ఏండ్ల‌లో తెలంగాణ‌లో రూ. 9,500 కోట్ల పెట్టుబ‌డులు పెట్ట‌బోతున్నామ‌ని జ‌య‌దేవ్ ప్రకటించారు. మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లా దివిటిప‌ల్లిలో విద్యుత్ వాహ‌నాల బ్యాట‌రీల త‌యారీ యూనిట్‌ను నెల‌కొల్ప‌నున్న‌ట్లు అమ‌ర‌రాజా గ్రూప్ ప్ర‌క‌టించింది.