పోలవరం ప్రాజెక్టును వైసీపీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శించారు. విభజన సమయంలోనే తాము పోలవరం విషయంలో పట్టుపట్టామని గుర్తు చేశారు. జగన్రెడ్డి రివర్స్ టెండరింగ్ పేరుతో పోలవరం ప్రాజెక్ట్ను నాశనం చేశారని దుయ్యబట్టారు. టీడీపీ హయాంలోనే పోలవరాన్ని 75 శాతం పూర్తిచేశామని, ప్రాజెక్ట్ పెండింగ్ పనులను కూడా ప్రభుత్వం పూర్తిచేయట్లేదని తప్పుబట్టారు. అయితే… చంద్రబాబు పర్యటన నేపథ్యంలో భారీగా పోలీసులను మోహరించారు. పోలవరంలో పోలీసులు చంద్రబాబును కూడా అడ్డుకున్నారు. దీనికి నిరసనగా చంద్రబాబు రోడ్డుపైనే బైఠాయించారు. పోలవరం ప్రాజెక్టును సందర్శించకుండా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో టీడీపీ శ్రేణులకు, పోలీసులకు మధ్య తోపులాట జరగింది.
పోలవరం ఏపీ ప్రజల కోరిక అని, ప్రజల జీవనాడి అని అన్నారు. ఈ ప్రాజెక్టును పూర్తి చేసి, నదుల అనుసంధానం చేస్తే ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ద్వారా శ్రీకాకుళం వరకు, కుడి ప్రధాన కాలువ ద్వారా కర్నూలు వరకూ సాగునీరు ఇవ్వొచ్చని ప్రణాళికలు రూపొందించామని వివరించారు. టీడీపీ మళ్లీ అధికారంలోకి వచ్చాక పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసే బాధ్యత తనదేనని హామీ ఇచ్చారు.అలాగే మెరుగైన ప్యాకేజీతో పాటు పోలవరం ప్రభావిత మండలాలతో ప్రత్యేక జిల్లాను ఏర్పాటు చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు.