ఇస్రో శాస్త్రవేత్త నంబి నారాయణ్ కేసు వ్యవహారంలో సుప్రీం కోర్టు కీలక తీర్పునిచ్చింది. నంబి నారాయణన్ ను ఇరికించారన్న కేసులో మాజీ డీజీపీతో సహా నలుగురు నిందితులకు కేరళ హైకోర్టు మంజూరు చేసిన ముందస్తు బెయిల్ ను సుప్రీం కొట్టేసింది. ఈ కేసును తిరిగి హైకోర్టుకే బదిలీ చేస్తున్నామని, నాలుగు వారాల్లో నిర్ణయం తీసుకోవాలని న్యాయమూర్తులు జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ సిటి రవి కుమార్ తో కూడిన ధర్మాసనం పేర్కొంది. సీబీఐ అప్పీల్ ను అంగీకరిస్తున్నామని, ఈ కేసులో నిందితులకు ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ కేరళ హైకోర్టు ఇచ్చిన తీర్పును కొట్టేస్తున్నామని సుప్రీం పేర్కొంది. ఈ కేసుకు సంబంధించిన అన్ని పిటిషన్లను తిరిగి హైకోర్టుకే పంపుతున్నామని, నిందితుల బెయిల్ దరఖాస్తును మొదటి నుంచి విచారించాలని సుప్రీం సూచించింది.