సుప్రీం కోర్టు చరిత్రలో మరో అరుదైన ఘట్టం సంభవించింది. ఇప్పటికే కేసు వాదనల్లో లైవ్ టెలికాస్ట్ ను అనుమతించిన సుప్రీం కోర్టు… తాజాగా మహిళా న్యాయమూర్తులతో కూడిన ప్రత్యేక ధర్మాసనాన్ని ఏర్పాటు చేసింది. సుప్రీం కోర్టు చరిత్రలో ఇలా ఏర్పాటు చేయడం ఇది మూడో సారి. జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ బేలా ఎం. త్రివేదీతో కూడిన ధర్మాసనాన్ని సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ ఏర్పాటు చేశారు. ఈ మహిళ ధర్మాసనం పలు కేసులను విచారిస్తుందని పేర్కొన్నారు. ఈ మహిళా ధర్మాసనంలో వివాహానికి సంబంధించిన గొడవలు, మరో 10 బెయిల్ పిటిషన్లు వున్నాయి. ఇలా మొత్తం 32 పిటిషన్లను ఈ ధర్మాసనం విచారించనుంది. సుప్రీం కోర్టు తొలిసారి 2013 లో మహిళా న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనాన్నిఏర్పాటు చేశారు. జస్టిస్ సుధా మిశ్రా, జస్టిస్ రంజన ప్రకాశ్ దేశాయ్ బెంచ్ లో వున్నారు. ఆ తర్వాత 2018 లో సెప్టెంబర్ లో మహిళా న్యాయమూర్తులు జస్టిస్ భానుమతి, జస్టిస్ ఇందిరా బెనర్జీతో కూడిన ధర్మాసనం ఏర్పాటైంది.