ఎన్డీటీవీలో భారీ మార్పులు జరిగాయి. ఆ ఛానెల్ కు డైరెక్టర్ పదవిలో వున్న ప్రణయ్ రాయ్ తన పదవికి రాజీనామా చేసేశారు. ఆయనతో పాటు ఆయన భార్య రాధికా రాయ్ కూడా డైరెక్టర్ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. ఎన్డీటీవీ ప్రమోటర్ గ్రూప్ నుంచి ఇద్దరూ వెళ్లిపోయారు. ప్రణయ్ రాయ్, రాధికా రాయ్ డైరెక్టర్ పదవులకు రాజీనామా చేయడంతో సుదీప్త భట్టాచార్య, సంజయ్ పుగాలియా, సెంథిల్ సిన్నియ చెంగల్వరాయన్‌లను కొత్త డైరెక్టర్లుగా నియమించారు. ఎన్డీటీవీలో మెజారిటీ షేర్లు ఇప్పటికే అదానీ గ్రూప్ దక్కించుకుంది. యాజమాన్యపు హక్కులను కూడా సొంతం చేసుకుంది.
ఎన్‌డీటీవీ ప్రమోటింగ్ కంపెనీల్లో ఒకటైన ఆర్‌ఆర్‌పీఆర్ హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్‌ను అదానీ కొనుగోలు చేశారు. దాంతో ఎన్‌డీటీవీలో అదానీ గ్రూప్‌నకు 29.18 శాతం ఈక్విటీ వాటాగా లభించింది. అలాగే, బహిరంగ మార్కెట్ ద్వారా ఈ మీడియా సంస్థకు చెందిన మరో 26 శాతం వాటా కోసం ఓపెన్ ఆఫర్ ప్రకటించింది. మొత్తంగా ఎన్డీటీవీలో ప్రస్తుతం అదానీ గ్రూప్ 55.18 శాతం వాటా దక్కించుకుంది. ఎన్డీటీవీ యాజమాన్యపు హక్కు సొంతం చేసుకునేందుకు ఈ మాత్రం వాటా సరిపోతుంది. దీంతో, ఎన్డీటీవీ అదానీ గ్రూప్ సొంతమైంది.