ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశిస్తూ… కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మోదీని ఖర్గే రావణుడితో పోల్చారు. దీంతో బీజేపీ శ్రేణులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. గుజరాత్ ఎన్నికల ప్రచారంలో భాగంగా అహ్మదాబాద్ లో జరిగిన సభలో ఖర్గే ఈ వ్యాఖ్యలు చేశారు. తననే చూసి ఓటేయాలని ప్రధాని మోదీ అభ్యర్థిస్తున్నారని, తాము ఎన్ని సార్లు ఆయన ముఖం చూడాలి? ఎన్ని రూపాలు వున్నాయి? రావణుడి లాగా మీకు వంద తలలు వున్నాయా? అంటూ ఖర్గే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ… వ్యాఖ్యానించారు. దేశంలోని ప్రతి ఎన్నికల ప్రచారంలోనూ మోదీ పాల్గొంటున్నారని, ఆఖరికి కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా మోదీ ప్రచారం చేస్తున్నారని ఖర్గే ఎద్దేవా చేశారు.
అయితే… కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే చేసిన వ్యాఖ్యలపై బీజేపీ తీవ్రంగా మండిపడింది. గుజరాత్ పుత్రుడిని కాంగ్రెస్ అవమానిస్తోందని మండిపడ్డారు. గుజరాత్ ఎన్నికల్లో బీజేపీ ధాటిని తట్టుకోలేకే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని బీజేపీ ఐటీ సెల్ అధ్యక్షుడు అమిత్ మాలవీయా అన్నారు.












