తెలంగాణ నిరుద్యోగులకు సీఎస్ సోమేష్ కుమార్ తీపి కబురు అందించారు. రాష్ట్రంలో మరో 16,940 పోస్టుల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్ విడుదల చేస్తామని ఆయన ప్రకటించారు. సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు వివిధ క్యాటగిరీల్లో 60,929 పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసిందని, మరో 16,940 పోస్టుల నియామకానికి త్వరలో ఆదేశాలిచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని పేర్కొన్నారు. ప్రభుత్వ ఉద్యోగ ఖాళీల డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌పై టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌ డాక్టర్‌ బీ జనార్ధన్‌రెడ్డితో కలిసి పలుశాఖల ఉన్నతాధికారులతో సీఎస్‌ సమీక్షించారు.

 

భర్తీ ప్రక్రియలో సమయపాలన కచ్చితంగా పాటించడంతోపాటు రిక్రూట్‌మెంట్‌ త్వరగా పూర్తయ్యేలా చూడాలని అధికారులను ఆదేశించారు. సర్వీస్‌రూల్స్‌లో చేపట్టాల్సిన మార్పులు పూర్తిచేసి, అవసరమైన అన్ని వివరాలను టీఎస్‌పీఎస్సీకి వెంటనే అందజేస్తే.. వాటి ఆధారంగా వచ్చే నెలలో నోటిఫికేషన్లు జారీచేస్తుందని తెలిపారు. టీఎస్‌పీఎస్సీ, మెడికల్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు, పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు, రెసిడెన్షియల్‌ ఎడ్యుకేషన్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డుల ద్వారా ఉద్యోగాల భర్తీ ప్రక్రియ కొనసాగుతున్నదని తెలిపారు.