దేశంలో అతిపెద్ద డిఫెన్స్ ఈకో సిస్టం కలిగి ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటని, గత 7సంవత్సరాలకుపైగా కాలంలో ఇక్కడి డిఫెన్స్ ఈకో సిస్టం భారీగా విస్తరించిందని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. సీసీఐ, సొసైటీ ఆఫ్‌ ఇండియన్‌ డిఫెన్స్‌ మ్యానుఫ్యాక్చరర్స్‌ అండ్‌ కాన్ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఇండస్ట్రీ ఎస్‌ఐడీఎం ఆధ్వర్యంలో జరిగిన డిఫెన్స్ కంపెనీల ప్రతినిధుల రౌండ్ టేబుల్ సమావేశంలో మంత్రి కేటీఆర్‌ పాల్గొన్నారు. ఢిల్లీలో జరిగిన ఈ సమావేశానికి మంత్రి కేటీఆర్‌ వర్చువల్ గా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ తెలంగాణ రాష్ట్రంలో డిఫెన్స్ తయారీ రంగంలో ఉన్న అవకాశాలను వివరించారు.

 

డిఫెన్స్ రంగంలో పెట్టుబడులకు తెలంగాణ అత్యంత అనుకూలమైన ప్రాంతమని, ఏరోస్పేస్ రంగంలో స్థానికంగా సుమారు 1000కిపైగా ఎంఎస్‌ఎంఈ సంస్థలు పని చేస్తున్నాయని చెప్పారు. ముఖ్యంగా హైదరాబాద్ నగరానికి మిస్సైల్ హబ్ ఆఫ్ ఇండియాగా పేరు ఉన్నదన్నారు. ఇక్కడే డీఆర్‌డీవో, బెల్‌, హాల్‌ అనేక రక్షణ రంగ ప్రభుత్వ సంస్థలు ఉన్నాయన్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రపంచ దిగ్గజ ఏరోస్పేస్, డిఫెన్స్ సంస్థలు సైతం తెలంగాణలో భారీగా పెట్టుబడులు పెట్టిన విషయాన్ని ఈ సందర్భంగా మంత్రి గుర్తు చేశారు.