బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పై ప్రభుత్వ చీఫ్ విప్, టీఆర్ఎస్ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ మండిపడ్డారు. పాదయాత్ర పేరుతో బండి సంజయ్ ప్రజలను రెచ్చగొడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మొదట విభజన చట్టంలోని హామీలను కేంద్రంతో అమలు చేయించి, ఆ తర్వాత పాద యాత్ర చేయాలని సవాల్ విసిరారు. హన్మకొండలో దాస్యం వినయ్ విలేకరులతో మాట్లాడారు. బండి సంజయ్ పూర్తి అహంకారి అని, ఆయన చేపడుతోంది కుట్రపూరిత యాత్ర అని విమర్శించారు. ప్రజా మద్దతుతో ఏర్పాటైన ప్రభుత్వాలను కూల్చాలనుకుంటే ప్రజలు సహించరన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుంటోందని విమర్శించారు. ఈడీ, ఐటీ దాడులతో కేసీఆర్ కుటుంబం సహా, మంత్రులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని వెల్లడించారు. బీజేపీ నాయకుల కుట్రలను తిప్పికొడతామన్నారు.







