శారీరక శ్రమ లేకపోవడం వల్లే బీపీ, షుగర్‌లు వస్తున్నాయని  మంత్రి హరీశ్‌ రావు అన్నారు. జాతీయ అవయవదాన దినోత్సవం సందర్భంగా గాంధీ మెడికల్‌ కాలేజీలో ఏర్పాటు  చేసిన కార్యక్రమంలో మంత్రి హరీశ్‌ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అవయవదానానికి ముందుకు వచ్చిన కుటుంబాలకు సన్మానం చేశారు. అనంతరం హరీశ్‌ రావు మాట్లాడుతూ  స్కూల్‌ స్థాయి నుంచే విద్యార్థులకు ఆరోగ్యం వల్ల అవగాహన కల్పించాలని చెప్పారు. విద్య, మహిళా సంక్షేమం, ఆయుష్‌ విభాగాల ద్వారా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. మిషన్‌ భగీరథ, పల్లెప్రగతి, పట్టణ ప్రగతి ద్వారా రోగాలను నియంత్రించగలిగామన్నారు.

ఆరోగ్య తెలంగాణ అంటే రోగాలు రాకుండా చూడాలని సూచించారు. ప్రజలు వ్యాధుల బారినపడకుండా చూడాలని సీఎం కేసీఆర్‌ చెబుతున్నారని వెల్లడించారు.  ఒకరి అవయవదానంతో ఎనిమిది మందికి పునర్జన్మ కలుగుతుందన్నారు. ఆర్గాన్‌ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ ఆపరేషన్‌కు ఆరోగ్యశ్రీలో రూ.10 లక్షలు ఇస్తున్నామని తెలిపారు. త్వరలోనే గాంధీ దవాఖానలో అవయవ మార్పిడి బ్లాక్‌ ఏర్పాటు చేస్తామన్నారు. అనంత‌రం అవయవదానానికి ముందుకు వచ్చిన కుటుంబాలకు సన్మానం చేశారు.