హైదరాబాద్‌ నగరాన్ని దేశంలో నంబర్‌వన్‌గా నిలబెట్టాలనేదే సీఎం కేసీఆర్‌ సంకల్పమని రాష్ట్ర ఐటీ, మున్సిపల్‌ శాఖల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. ప్రపంచ స్థాయి నగరంగా ఎదిగేందుకు హైదరాబాద్‌కు అన్ని అర్హతలు, వనరులు ఉన్నాయని పేర్కొన్నారు. మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎంపీ రంజిత్‌రెడ్డి, జీహెచ్‌ఎంసీ మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మి, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే, ప్రభుత్వ చీఫ్‌ విప్‌ అరికెపూడి గాంధీతో కలిసి మంత్రి కేటీఆర్‌ శిల్పా లేఅవుట్‌ ఫ్లై ఓవర్‌ను ప్రారంభించారు.  ఫ్లైఓవర్‌ ప్రారంభంతో గచ్చిబౌలి జంక్షన్ లో ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి. ఐటి కారిడార్, ఓఆర్ఆర్ ను అనుసంధానం చేస్తూ ఫ్లైఓవర్‌ నిర్మించారు. ఐకియా మాల్ వెనుక మొదలై ఓఆర్ఆర్ పైకి ఫ్లైఓవర్‌ చేరనుంది. దీంతో ఫైనాన్స్ డిస్ట్రిక్ట్, హైటెక్ సిటీ మధ్య రోడ్ కనెక్టివిటీ మరింత పెరగనుంది. 956 మీటర్ల పొడవు 16.60 మీటర్ల వెడల్పుతో 4 వరసల ఫ్లైఓవర్‌ నిర్మాణం చేపట్టారు. రూ.250 కోట్లతో రెండంతస్థుల ఫ్లైఓవర్‌ ను తెలంగాణ ప్రభుత్వం నిర్మించింది. ఎస్ఆర్ డిపిలో భాగంగా చేపట్టిన పనుల్లో 17వ ప్రాజెక్ట్ పూర్తి అయింది. కార్యక్రమంలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మేయర్‌ గద్వాల విజయలక్ష్మితో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.